కన్నడనాట ఎన్నికలు సమీపిస్తున్న పార్టీల మధ్య పోరు నువ్వా–నేనా అన్నట్లు ఆసక్తికరంగా సాగుతోంది. అధికారం తమదంటే తమదని కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకుంటున్నప్పటికీ.. వివిధ సర్వే సంస్థలు సోమవారం ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ మాత్రం హంగ్ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. టైమ్స్ నౌ–వీఎంఆర్ చేసిన సర్వేలో అధికార కాంగ్రెస్ పార్టీ 91 స్థానాల్లో, బీజేపీ 89 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయని వెల్లడైంది.
గత ఎన్నికల్లో 40 సీట్లు గెలిచిన జేడీఎస్ ఈసారి కూడా అదే సంఖ్యలో సీట్లు గెలుచుకుని కీలకంగా మారనుంది. ఏబీపీ–సీఎస్‌డీఎస్ సర్వే బీజేపీకి 92, కాంగ్రెస్‌కు 88 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మొత్తం 224 సీట్లలో అధికారం చేజిక్కించుకునేందుకు కనీసం 113 సీట్లు రావాల్సిందే. సీఎస్‌డీఎస్ సర్వేలో ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య 46.15%, యడ్యూరప్పకు 31.76%, కుమారస్వామికి 17.63% మంది మద్దతు లభించింది. టైమ్స్‌నౌ–వీఎంఆర్ సర్వేను ప్రాంతాల వారిగా గమనిస్తే..
బాంబే కర్ణాటకలో
బీజేపీ ఓటుశాతం 2013 అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా పెరగనుందని సర్వేల ద్వారా స్పష్టమైంది. బాంబే కర్ణాటక ప్రాంతంలో మొత్తం 50 సీట్లున్నాయి. బాగల్‌కోట్, ధార్వాడ్, బెళగావి, బీజాపూర్, గదగ్ తదితర జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడున్న సీట్లలో 2013లో కాంగ్రెస్ 31 చోట్ల గెలవగా.. బీజేపీ 13, జేడీఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న లింగాయత్‌లపై.. కాంగ్రెస్ ఇస్తామన్న ‘మతపరమైన మైనారిటీ హోదా’ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సర్వే తెలిపింది. గతంలో 13 సీట్లున్న బీజేపీ ఈసారి 23 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ 10 స్థానాలు కోల్పోనుంది.
కోస్తా కర్ణాటకలో..:
ఈ ప్రాంతంలో మొత్తం 21 సీట్లున్నాయి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి తదితర జిల్లాలు ఈ ప్రాంతంలో ఉంటాయి. కర్ణాటకలో ముస్లింలు, క్రైస్తవుల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో ఎక్కువే. అయితే ఈసారి మెజారిటీ సీట్లలో గెలవాలంటే మతపరమైన పోలరైజేషన్ తప్పనిసరని బీజేపీ భావిస్తోంది. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.
గ్రేటర్ బెంగళూరులో..
బెంగళూరు నగరంతోపాటు చుట్టుపక్కనున్న 32 నియోజకవర్గాలు గ్రేటర్ బెంగళూరు పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 15 చోట్ల, బీజేపీ 12 చోట్ల గెలిచాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలిచే పార్టీకే అధికారం అందే అవకాశాలుంటాయి. చదువుకున్న ఓటర్లు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పలు అభివృద్ధి అంశాలతోపాటుగా సిద్దరామయ్య లేవనెత్తిన ‘కన్నడ అస్మిత’, బీజేపీ అస్త్రమైన ‘హిందుత్వ’లు కీలకంగా పనిచేస్తాయని భావిస్తున్నారు. ఈసారి రెండు పార్టీలూ తమ సీట్లను మరో రెండు మూడు వరకు పెంచుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది.
మధ్య కర్ణాటకలో..
దీన్నే మలెనాడు ప్రాంతం అనికూడా అంటారు. 35 స్థానాలున్న ఈ ప్రాంతంలో యడ్యూరప్ప ప్రభావం స్పష్టంగా ఉంటుంది. బీజేపీకి సానుకూలమైన సెంట్రల్ కర్ణాటకలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది. ఈసారి బీజేపీ.. 22 సీట్లను గెలుచుకోవచ్చని టైమ్స్‌నౌ సర్వే పేర్కొంది.
హైదరాబాద్ కర్ణాటక
ఈ ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువ. కర్ణాటకలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన హైదరాబాద్ కర్ణాటకలో మొత్తం 31 నియోజకవర్గాలున్నాయి. 2013లో కాంగ్రెస్ 19చోట్ల, బీజేపీ 4చోట్ల గెలిచాయి. బీదర్, గుల్బర్గా, బెళ్లారి, రాయ్‌చూర్ వంటి జిల్లాలు ప్రధానమైనవి. ఈ ప్రాంతంపై యడ్యూరప్పకు మంచి పట్టుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది.
పాత మైసూరు
తమిళం మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో జేడీ(ఎస్)కు మంచి పట్టుంది. మొత్తం 55 స్థానాల్లో మెజారిటీ చోట్ల ఇక్కడ ఒక్కళిగలు ఫలితాలను ప్రభావితం చేయగలరు. 2013లో కాంగ్రెస్ 25, జేడీఎస్ 23, బీజేపీ కేవలం రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్ ప్రభావం బీజేపీ కంటే కాంగ్రెస్‌పైనే ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని సర్వేలో తేలింది. అందుకే బీజేపీ గతంలో కన్నా ఆరు సీట్లను, జేడీఎస్ రెండు సీట్లను అదనంగా గెలుచుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కన్నా సిద్దరామయ్య ప్రభావమే ఎక్కువగా కనబడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment