సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజరాజేశ్వరీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న 41,162 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికలు ఆలస్యంగా జరిగిన ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి మునిరత్న పోటీచేయగా, జేడీఎస్ నుంచి జీహెచ్ రామచంద్ర, బీజేపీ నుంచి తులసి మునిరాజు గౌడ బరిలోకి దిగారు. ఇక్కడ మొత్తం 53శాతం పోలింగ్ నమోదవ్వగా..కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మొదటినుంచి ఆధిక్యం కనబరుస్తూ భారీ మెజారిటీతో గెలుపొందారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న అన్ని నియోజకవర్గాలతోపాటు ఇక్కడ కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, భారీగా నకిలీ ఓటరు ఐడీ కార్డులు దొరకడంతో ఇక్కడ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ సాధారణ మెజారిటీ సాధించని సంగతి తెలిసిందే. మొదట ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నించడం.. గవర్నర్ ఆహ్వానించడం.. సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప బలనిరూపణకు ముందే రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామి నేతృత్వంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కర్ణాకటలో కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్ నగర్‌లో కాంగ్రెస్ విజయం సాధించడం బీజేపీ శ్రేణులను మరింత నిరాశకు గురి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment