
సాక్షి, కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల వారోత్సవాల బస్సు యాత్ర సోమవారం కరీంనగర్ చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నగరంలోని అనభేరి ప్రభాకర్ రావు, బద్దం ఎల్లారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైజాం పాలన నుంచి తెలంగాణ విముక్తిపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వాస్తవాలు మాట్లాడారన్నారు. బీజేపీ అబద్ధాలతో చరిత్రను వక్రీకరిస్తుందని ఆరోపించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చెప్పిన వాస్తవాలు భావితరాలకు తెలిసేలా పాఠ్యాంశంలో చేర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారి ఫోటోలతో మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. అలానే ట్యాంక్‌బండ్‌పై అమరవీరుల విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు కొత్త జిల్లాలకు త్యాగమూర్తుల పేర్లు పెట్టాలని సూచించారు. యూరేనియం తవ్వకాలను నిలిపివేసి, అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని చాడ డిమాండ్ చేశారు.