
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో అవసరమని సీపీఐ కేంద్ర కార్యదర్శి నారాయణ అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రహస్య ఎజండా ఉందని, ఆ రహస్యం ఎవరికీ తెలియదని నారాయణ తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. జూన్ నుంచి వర్షాలు మొదలైతే.. 2018 నాటికి కాపర్ డ్యామ్ ఎలా పూర్తి అవుతుందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా భూసేకరణ కూడా పూర్తి కాలేదని అన్నారు. ఏపీలో ఓట్లు పడవనే ఉద్దేశంతో రాష్ట్రానికి అన్యాయం చేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. కేంద్రంలో చక్రం తిప్పుతామన్న చంద్రబాబు మాటలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ మతోన్మాదాన్ని పెంచుతోందని విమర్శించారు.