
శ్రీకాకుళంలో వామపక్ష నాయకులు మధు, రామకృష్ణను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి: వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాల్సిన ప్రభుత్వమే దౌర్జన్యానికి దిగడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దౌర్జన్యకాండను ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. శ్రీకాకుళంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం విపక్షాల పిలుపు మేరకు ‘చలో వంశధార’ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసులతో భగ్నం చేసింది. వామపక్ష పార్టీలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం రాత్రి నుంచి నిర్బంధంలోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం జిల్లావ్యాప్తంగా 39 మందిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం చేరుకున్న సీపీఎం నాయకుడు మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎంపీ మిడియం బాబూరావు తదితరులను అదుపులోకి తీసుకొని రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు పెద్ద ప్రాజెక్టులను నిర్మించినా నిర్వాసితులపై పోలీసు బలగాలను ప్రయోగించిన దాఖలాలు లేవన్నారు. నిర్వాసితుల సమస్యలేమిటో చెప్పుకోవడానికీ అనుమతించకపోవడం దారుణమని విమర్శించారు. వంశధారతోపాటు పోలవరం తదితర ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై గళం వినిపించడానికి ఈనెల 16, 17∙తేదీల్లో విజయవాడలో 30 గంటల ధర్నా తలపెడుతున్నామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల సంఘీభావం..
‘చలో వంశధార’లో పాల్గొనకుండా వైఎస్సార్‌సీపీ రాజ కీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ తదితర నాయకులను పోలీసులు నరసన్నపేటలో అడ్డుకున్నారు. బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. తర్వాత విడిచిపెట్టడంతో రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఉన్న వామపక్ష నాయకులకు సంఘీభావం ప్రకటించారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి గాలి కబుర్లతోనే కాలక్షేపం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరపడిందని హెచ్చరించారు. ఇలా ఉండగా, అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేయడాన్ని పది వామపక్ష పార్టీలు ఓ ప్రకటనలో ఖండించాయి.
Comments
Please login to add a commentAdd a comment