సాక్షి, హైదరాబాద్: పరుష పదజాలం ఉపయోగించిన వారిపై కేసులు నమోదుచేసేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు తీరుపై టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. ఐపీసీ సెక్షన్లు 506, 507ను క్రిమినల్, నాన్ బెయిలబుల్ కేసులగా మార్పు చెయ్యడం నియంతృత్వ చర్యనని విమర్శించారు. సోషల్ మీడియాను నియంత్రించాలనుకోవడం కేసీఆర్ తుగ్లక్ చర్య, దూరహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
శాశ్వత వ్యవస్థలను చెడగొట్టే హక్కు తోటమాలిగా ఉండే సీఎంకు లేదని, సీఎం ఎవరైనా.. వస్తారు పోతారు.. ఎవరో తలకు మాసిన వారు ఇచ్చిన న్యాయ సలహా ఇదని విమర్శించారు. ఈ విషయంలో మరోసారి న్యాయవ్యవస్థ నుంచి మొట్టికాయలు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారానే నిర్భయ చట్టం వచ్చిందని, తెలంగాణ ఉద్యమానికి అండ దండ లభించిందని గుర్తుచేశారు. మీడియాను బెదిరించి ప్రభుత్వ వ్యతిరేక వార్తలను నిలవరించినట్టే.. సామాజిక మాధ్యమాల మీద సీఎం పడ్డారని విమర్శించారు. నాడు ఉద్యమంలో సోషల్ మీడియా పాత్ర భేష్ అని పేర్కొన్న సీఎం.. ఇప్పుడు దాన్నే నియంత్రించాలనుకోవడం దారుణమన్నారు.
‘ధర్నా చౌక్ ఉండొద్దు.. నిరసన హక్కు ఉండొద్దు అంటున్నారు. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, లేక కల్వకుంట్ల రాజ్యాంగం ఉందా? ఈ ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతాం. తెలంగాణ ను పోలీస్ రాజ్యంగా మారుస్తారా? మీరు మాట్లాడిన భాష ఎలా ఉంది? దానికి సమాధానం ఏమిటి, మీ ఎమ్మెల్యేలు బెదిరింపుల మాట ఏమిటి? మీ మీద ఎన్నిసార్లు ఎన్ని కేసులు పెట్టాలి? ఆర్టీసీ ఉద్యోగి సంజీవ్ ఏం తప్పు చేశాడని తొలగించారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అడగటం తప్పా’ అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment