సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే కారణమనే సెంటిమెంటును అస్త్రంగా ప్రయోగించి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. దీని అమలు కోసం అతిరథ మహారథులు రాష్ట్రానికి వస్తున్నారు.కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, ఏఐసీసీ ట్రెజరర్ అహ్మద్ పటేల్ రంగప్రవేశం చేశారు.
శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడిన బిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్‌పటేల్ బుధవారం వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ట్రబుల్ షూటర్‌గా వెళ్లే కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జైరాంరమేశ్ వరకు అందరూ క్యూ కట్టి హైదరాబాద్ వస్తున్నారు.వీరప్పమొయిలీ, జైపాల్‌లాంటి నేతలు దౌత్యం చేస్తుండగా, కుష్బూ, చిదంబరం, పృథ్వీరాజ్‌చౌహాన్, నారాయణస్వామిలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికల రంగంలో వేడి పెంచుతున్నారు.
సర్దుకు పోండి.. మేం అండగా ఉంటాం
‘మహాకూటమి’కారణంగా కుదుర్చుకున్న పొత్తుల వల్ల నష్టపోతున్న స్థానాలు, పార్టీలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించేందుకు ఏఐసీసీ పెద్ద కసరత్తే చేసింది.అభ్యర్థుల ఖరారుకు ముందే రాష్ట్రానికి చెందిన 15 మంది వరకు నేతలను ఢిల్లీకి పిలిపించి వార్‌రూంలో చర్చించిన పార్టీ అధిష్టానం... అభ్యర్థిత్వాల ఖరారు కోసం మరోమారు బృందాలను పంపింది. మొదటి దఫాలో కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావులు హైదరాబాద్‌కు వచ్చి అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.
దాదాపు 25 మంది నేతలతో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమై వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత బెట్టుగా ఉన్న మరికొందరిని దారిలోకి తెచ్చుకునేందుకు ఇద్దరు సీనియర్లకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పజెప్పింది. కేంద్ర మాజీ మంత్రులు వీరప్పమొయిలీ, ఎస్.జైపాల్‌రెడ్డిలు గత రెండురోజులుగా ఇదే పనిలో ఉన్నారు. ఇక బుధవారమే హైదరాబాద్ నగరానికి చేరుకున్న జైరాంరమేశ్ కూడా ఇదే పనిలో ఉన్నారు.
మేడ్చల్ నియోజకవర్గ టికెట్ ఆశించిన తోటకూర జంగయ్యయాదవ్ వద్దకు కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, జెట్టి కుసుమకుమార్‌లతో కలపి బోడుప్పల్‌కు వెళ్లి మరీ జంగయ్యకు సర్దిచెప్పారు. ఈ చర్యలతో రెబెల్స్ బెడద అంతగా లేకుండా నివారించుకోగలిగారు. మరోవైపు శివకుమార్ గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు.ప్రచారం, వ్యూహాలు, అంతర్గత సమస్యలపై ఆయన టీపీసీసీ ముఖ్యులతో సమన్వయం చేస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఈనెల 23న జరగనున్న సోనియా, రాహుల్‌ల సభను జయప్రదం చేసేందుకు జైరాంరమేశ్ కూడా ఆయనకు తోడయ్యారు.
ఇచ్చామన్న సెంటిమెంటుతో...
పోయిన చోటే వెతుక్కోవాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సెంటిమెంట్‌ను మరోసారి తెలంగాణ ప్రజలకు గుర్తుకు తేవాలనే వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీతో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొననున్నారు. ఈ సభలోనే తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా సోనియాకు సన్మానం చేసేందుకు టీపీసీసీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరాన్నీ రంగంలోకి దింపారు. బుధవారమే హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తెలంగాణ రాష్ట్రానికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని సెంటిమెంట్‌తో కొట్టే ప్రయత్నం చేశారు. చిదంబరంతో పాటుగా తెలంగాణ బిల్లును రూపొందించిన కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేశ్ కూడా హైదరాబాద్ వచ్చారు. వీరిద్దరితో ఎన్నికల ప్రచారం చేయించడం ద్వారా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసే ప్రయత్నానికి వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టడం గమనార్హం.
బిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్ పటేల్
శేరిలింగం పల్లి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతియాదవ్‌ను ఆయన ఇంటికి వెళ్లి ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్ అనునయించారు. ఆయనకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఏమిస్తామన్నది ఇప్పుడు చెప్పడం ధర్మం కాదని అయితే బిక్షపతి యాదవ్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేందుకు అంగీకరించారని అహ్మద్ పటేల్ విలేకరులకు తెలిపారు.పటేల్ వెంట పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, మధుయాష్కి తదితరులు ఉన్నారు.
మహిళా నేతలతో..
ప్రచారం కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా నేతలనూ రంగంలోకి దింపింది. రాష్ట్రానికి చెందిన స్టార్‌క్యాంపెయినర్ విజయశాంతికి తోడు తమిళనాడుకు చెందిన ఖుష్బూ సుందర్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జడ్చర్లలో రోడ్‌షో చేసిన ఖుష్బూ వచ్చే వారంలో మరిన్ని చోట్ల ప్రచారం చేయనున్నారు. ఈమెతో పాటు ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాదేవ్ కూడా ఈసారి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment