
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత బాబుకు లేదని అన్నారు. వందేళ్లైనా జరగవు అనుకున్న పనులను సీఎం జగన్ వంద రోజుల్లోనే చేసి చూపించారని కొనియాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టని సంస్కరణలు సీఎం జగన్ వంద రోజుల్లోనే చేశారని పేర్కొన్నారు. ‘అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే లక్షా 33 వేల ఉద్యోగాలిచ్చారు. దేశంలో ఏ సీఎం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. అది సీఎం జగన్ చిత్తశుద్ధి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు, పనుల్లో 50 శాతం వాటా ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిది. కల్లోనైనా చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోసం ఆలోచించారా’ అని అన్నారు.
పునరావాస కేంద్రాల పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని పుష్ప శ్రీవాణి విమర్శించారు.నారాయణ కాలేజీల్లో 25 మంది ఆడపిల్లలు చనిపోయినప్పుడు, ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని ప్రభాకర్ కొట్టినప్పుడు ఎందుకు పునరావాస కేంద్రాలు పెట్టలేదని ప్రశ్నించారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, నేతల్ని కాపాడుకోవడానికే బాబు పునరావాస కేంద్రాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనకే చంద్రబాబుకు మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ఏం విమర్శించాలో తెలియక డ్రామా ఆర్టిస్టులతో దుష్ప్రచారానికి తెగబడ్డారని, ఇప్పటికయినా అబద్దాలు మాని చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలని ఆమె హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment