ఏనాడైనా మంచిని చూస్తున్నారా? | Kommineni Srinivasa Rao Eenadu False News Visakhapatnam Executive Capital | Sakshi
Sakshi News home page

ఏనాడైనా మంచిని చూస్తున్నారా?

Published Wed, Oct 19 2022 12:24 AM | Last Updated on Wed, Oct 19 2022 12:24 AM

Kommineni Srinivasa Rao Eenadu False News Visakhapatnam Executive Capital - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరమైన విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని కాకుండా ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి! విశాఖలో కబ్జాలు పెరుగు తున్నాయి; విలువైన భూములను బెదిరించి లాక్కుంటున్నారు... నిత్యం ఇలాంటి కథనాలను ‘ఈనాడు’ తదితర టీడీపీ మీడియా సంస్థలు వండి వారుస్తున్నాయి. మరి అమరావతిలోని గ్రామాలలో జరిగిన భాగోతాల మాటేమిటి? కబ్జాలు జరుగుతున్నాయి కాబట్టి అమరావతి రాజధానిగా పనికి రాదని అప్పట్లో ‘ఈనాడు’ ఎందుకు రాయలేదు? విశాఖలో ఎవరైనా తమకు గిట్టనివారు భూములు కొంటే అదంతా దోపిడీ అని రాస్తారా? ఒకవేళ నేరాలు జరిగితే, మొత్తం ప్రజలంతా నేరపూరితం అవుతారా? ఉత్తరాంధ్ర, విశాఖపట్నం ప్రజలు అంత అమాయకులా?

అమరావతి రాజధాని ప్రకటన తర్వాత సుమారు 1,100 ఎకరాల అసైన్డ్‌ భూమిని బడా కామందులు, రాజకీయనేతలు కొట్టేశారు కదా? ప్రభుత్వం కూడా వీరికి సహకరించి, ప్యాకేజీ రూల్స్‌ను అసైన్డ్‌ భూములు కొన్న వారికి కూడా వర్తింపజేసింది కదా! అవన్నీ పేదలకు మేలు చేసే విషయాలని ‘ఈనాడు’ పత్రిక భావించిందా? పేదలంతా తమకు భూములు అక్కర్లేదు.. రాజధాని వస్తే చాలని పెద్దవాళ్లకు రాసిచ్చే శారా? ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ పేరిట సుమారు 4,500 ఎకరాల భూములను టీడీపీ పెద్దలు, వారి సంబంధీకులు చౌకగా ఎలా కొనగలిగారు? అమ రావతి భూముల ద్వారా కోట్లు సంపాదించారని స్వయంగా ఆనాటి సీఎం చంద్రబాబునాయుడే చెప్పేవారు కదా? అదంతా వైట్‌ మనీనా, బ్లాక్‌ మనీనా? ఆ విషయాలను ‘ఈనాడు’ ఎందుకు దాచి పెట్టింది?

హైదరాబాద్‌ నగరంలో వేల ఎకరాల భూదందా జరిగింది. ఇప్పటికీ పలు ఆరోపణలు వస్తుంటాయి. ఎన్నడైనా హైదరాబాద్‌ రాజధానిగా వద్దు అని ‘ఈనాడు’ రాసిందా? జగన్నాటకం పేరుతో ‘ఈనాడు’ రాసిన కథనం విషపూరిత వార్తలకు పరాకాష్ఠ అని చెప్పాలి. విశాఖలో గర్జన సభను చెడగొట్టాలన్న లక్ష్యంతో టీడీపీ మీడియా సంస్థలు పలు కథనాలు ప్రచారం చేశాయి, చేస్తున్నాయి. రాజధాని అయితే విశాఖకు ఏదో ప్రమాదం వస్తుందన్న భావన కల్పించడమే వీరి లక్ష్యం. అమరావతి రాజధాని అన్నప్పుడు ఏపీ సీఎం జగన్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలలో తమకు కావల్సినమేరకు తీసుకుని ఆయన అభిప్రాయాలు మార్చుకున్నారన్నది ‘ఈనాడు’ రోదన. ఒకవేళ అభిప్రాయాలు మార్చుకుంటే తప్పేమిటి? అమరా వతిలో లక్షల కోట్లు వ్యయం చేయలేం కనుక, విశాఖ అయితే ప్రపంచవ్యాప్తంగా వెంటనే గుర్తింపు వస్తుందని జగన్‌ భావించారు కనుక ఆయన ఈ ప్రతిపాదన చేశారని ఎందుకు అనుకోగూడదు! 

చంద్రబాబు నాయుడు తన నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నివందల సార్లు అభిప్రాయాలు మార్చుకుని ఉంటారు? ఎన్టీఆర్‌ అవసరం టీడీపీకి లేదనీ, అసలు ఎన్టీఆర్‌కు నైతిక విలువలే లేవనీ ఆయన అన్నారా, లేదా? ఎన్టీఆర్‌ మరణం తర్వాత మళ్లీ మొత్తం యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు అప్పుడు ఏమని మాట్లాడారు? మరి ఏనాడైనా ఆ విషయాలను ‘ఈనాడు’ ప్రస్తావించిందా? 1996 లోక్‌సభ  ఎన్నికల సమయంలో టీడీపీ గెలిస్తేనే 2 రూపాయల కిలో బియ్యం స్కీమ్‌ కొనసాగుతుందనీ, కాంగ్రెస్‌ గెలిస్తే రేట్లు పెరుగు తాయనీ చంద్రబాబు ప్రచారం చేశారా, లేదా? తాను మరింత పటిష్ఠంగా మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పి, హెల్త్‌ పర్మిట్లు కూడా ఎత్తివేశారా, లేదా? ఎన్నికలు అయిన కొద్ది కాలానికే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక పెద్ద తంతు నిర్వహించి బియ్యం రేట్లు పెంచడం, మద్య నిషేధాన్ని ఎత్తివేయడం ఎందుకు చేశారు? విద్యుత్‌ సంస్కరణలకు తానే ఆద్యుడిననీ, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవల్సిందేననీ చెప్పారా, లేదా? ఇటీవలి కాలంలో విద్యుత్‌ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చంద్రబాబు ఎందుకు మాట్లాడుతున్నారు? రైతుల మోటార్లకు మీటర్లు పెడితేనే ఏదో ప్రమాదం జరిగిపోతుందని చంద్రబాబు చెబుతుంటే, గతంలో మీరు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు కదా అని ‘ఈనాడు’ ఏనాడైనా ప్రశ్నించిందా? 

2014 ఎన్నికలకు ముందు రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు లక్ష కోట్లు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పినప్పుడు... అవునవును ఆయన కాబట్టే చేయగలరని ‘ఈనాడు’ ప్రచారం చేసిందా, లేదా? అధికారంలోకి వచ్చాక రైతులు ఆశపోతులుగా ఉండకూడదని ఆయన అన్నప్పుడు అదేమిటని ‘ఈనాడు’ ఎన్నడైనా రాసిందా? గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు నరహంతక ప్రభుత్వమని చంద్రబాబు విమర్శించారా, లేదా? హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వనని ప్రకటించారా, లేదా? 2014లో మోదీ చుట్టూ తిరిగి బతిమలాడి మరీ ఎలా పొత్తు పెట్టుకున్నారు? 2019 నాటికి మళ్లీ బీజేపీతో గొడవపడి మోదీ భార్యను సైతం వివాదాలలోకి తెచ్చి మాట్లాడినప్పుడు...  ఇదేమిటి చంద్రబాబు అని ‘ఈనాడు’ అడిగిందా? 2004లో తెలుగుదేశం పార్టీ ఓటమికి గురైన తర్వాత జరిగిన మహానాడులో సమైక్య ఆంధ్రప్రదేశే తమ విధానమని తీర్మానం చేశారా, లేదా? 2008 నాటికి ప్రత్యేక తెలంగాణకు అను కూలంగా ఒకటికి రెండుసార్లు కేంద్రానికి లేఖలు పంపించారా, లేదా? 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టు కోవడానికి తమ వైఖరి మార్చు కోలేదా? 2009లో అసెంబ్లీలో ప్రత్యేక తెలంగాణ తీర్మానం పెట్టాలని డిమాండ్‌ చేశారా, లేదా? తీరా కేంద్రం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రక టించిన తర్వాత ఆంధ్ర, రాయలసీమ టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా డ్రామాలు ఆడించడంలో చంద్రబాబు క్రియాశీలకంగా లేరా? కొన్ని వందలసార్లు చంద్రబాబు తన అభిప్రాయాలను మార్చు కున్నారు. అలా మార్చుకోవడం ఒక ఎత్తు అయితే, పరస్పర విరు ద్ధంగా మాట్లాడి రాజకీయ ప్రయోజనం పొందడం మరో ఎత్తు. 

రాజధాని విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం నియమించిన శివ రామకృష్ణన్‌ కమిటీ చేసిన సిఫారసులు ఏమిటి? చంద్రబాబు చేసిం దేమిటి? మూడు పంటలు పండే భూములను రాజధానిగా ఎంపిక చేయవద్దనీ, అన్ని ప్రభుత్వ ఆఫీసులూ ఒకే చోట పెట్టవద్దనీ ఆ కమిటీ చెబితే... నవ నగరాల పేరుతో సమస్తం అమరావతి గ్రామాలలో వేల కోట్లు వ్యయం చేయడానికి చంద్రబాబు పూనుకున్నప్పుడు, మీరు చేస్తున్నదేమిటని ‘ఈనాడు’ ఎన్నడైనా ప్రశ్నించిందా? రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా చంద్రబాబు ప్రజల కోసమే పని చేశారని ‘ఈనాడు’ చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని నమ్మా లన్న మాట! ఒక విధంగా చూస్తే చంద్రబాబు నాయుడు కన్నా ఈ మీడియానే అతి ప్రమాదకరంగా మారిందని అర్థం అవుతుంది. 

ఇక బీజేపీ నేతల సంగతి చూద్దాం. టీడీపీతో అధికారం పంచు కుంటున్న రోజుల్లోనే రాయలసీమ డిక్లరేషన్‌ పేరుతో కర్నూలులో హైకోర్టు పెట్టాలనీ, సచివాలయం, సీఎం ఆఫీస్, గవర్నర్‌ ఆఫీస్‌ పెట్టాలనీ బీజేపీ  డిమాండ్‌ చేసిందా, లేదా? ఇప్పుడు అన్నీ ఓకే చోట ఉండాలని తెలుగుదేశం పార్టీని తోకలా ఎందుకు సమర్థిస్తోంది? ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా నరేంద్ర మోదీ చెబితే అంతా నిజ మని నమ్మారు కదా? తీరా ప్రధాని అయిన తర్వాత ప్యాకేజీ మాత్రమే ఇస్తామని అనడం అబిప్రాయం మార్చుకోవడమా, కాదా? ఈ విషయంలో చంద్రబాబు మాటల మార్పు గురించి మాట్లాడుకోవడం అనవసరం. పవన్‌ కల్యాణ్‌కు ఎటూ దేనిపైనా ఒక క్లారిటీ ఉండదు కనుక ఆయన ఎప్పుడు ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదు. కానీ సిద్ధాంతం కలిగి ఉన్నామని చెప్పే వామపక్షాలు, ముఖ్యంగా సీపీఐ అచ్చంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, బడా భూస్వాములకు కొమ్ము కాస్తూ, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని కూడా సమర్థించలేని దుఃస్థితిలో పడిపోయింది కదా? 

మరోవైపు వైసీపీ అధినేత జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను హామీ ఇచ్చిన విధంగా మానిఫెస్టోలోని 95 శాతం వాగ్దానాలను నెరవేర్చితే ‘ఈనాడు’ ఎన్నడైనా మెచ్చుకుందా? అమలుకాని కొద్ది పాటి హామీలను మాత్రమే గుర్తు చేస్తూ ప్రజలలో వ్యతిరేకత పెంచా లని ఎందుకు చూస్తోంది? కొన్ని ప్రొఫెషనల్‌ కమిటీలను నియమించి విశాఖపట్నం రాజధాని అయితే వచ్చే ప్రయోజనాలను గమనించి, దానిని కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధా నిగా, శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు పెట్టి న్యాయ రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకుంటే ఎన్ని గొడవలు చేస్తు న్నారు! ఎన్ని అవాంతరాలు సృష్టిస్తున్నారు! చివరికి ఆయా వ్యవస్థ లను కూడా ప్రభావితం చేసి తమకు అనుకూలంగా ఎలా మార్చు కుంటున్నారు! వీటన్నింటినీ తట్టుకుని జగన్‌ నిలబడడమే అతి పెద్ద విజయం అని చెప్పాలి.


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement