బాబు బిల్డప్‌కు ఎల్లో మీడియా డప్పులు | YSRCP president YS Jagan questioned Chandrababu naidu | Sakshi
Sakshi News home page

పోర్టులు, మెడికల్‌ కాలేజీలు అమ్మేస్తూ.. సీ–ప్లేన్‌తో నాటకాలా?

Published Mon, Nov 11 2024 4:24 AM | Last Updated on Mon, Nov 11 2024 7:16 AM

YSRCP president YS Jagan questioned Chandrababu naidu

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.13,254.05 కోట్లతో మూడు పోర్టుల నిర్మాణం 

రూ.8,480 కోట్లతో అత్యాధునిక వైద్యం, కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు 

రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ రంగంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడైనా పెట్టారా? 

ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలుగా రాష్ట్ర ప్రజల కళ్ల ముందు లేవా? 

ఈ ఆస్తులు విలువ భవిష్యత్తులో రూ.లక్షల కోట్లు కాదా?  

ఇదంతా అభివృద్ధి కాదా? సంపద సృష్టి కాదా? 

వీటిపై స్కామ్‌లు చేస్తూ మీ మనుషులకు తెగనమ్మడం సంపద సృష్టించడమా? 

స్కూళ్లు, మెడికల్‌ కాలేజీలు, పోర్టులు లేకుండా చేస్తూ విన్యాసాలా?  

ప్రజల ఆస్తులను వారికి కాకుండా చేసే దుర్మార్గపు చర్యలివి  

వీటిపై ప్రజల్లో చర్చ జరగకూడదనే సీ ప్లేన్‌తో పబ్లిసిటీ స్టంట్‌ 

ఇదంతా చూస్తుంటే పిట్టల దొర డైలాగ్‌లు గుర్తుకొస్తున్నాయి 

ఈ దుర్మార్గపు చర్యలను ప్రజలు ఎండగడతారు.. ప్రభుత్వాన్ని నిలదీస్తారు  

చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ‘సీ ప్లేన్‌ నడిపితే రాష్ట్రాభివృద్ధి జరిగిపోయినట్లా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌­సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. దేశంలో తొలిసారిగా సీ ప్లేన్‌ నడిపినట్టుగా చంద్రబాబు బిల్డప్‌ ఇస్తుండటం.. అందుకు ఎల్లో మీడియా డప్పు కొడుతుండటం చూస్తుంటే పిట్టల దొర డైలాగ్‌లు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజల సంపదగా నిర్మిస్తూ సృష్టిŠంచిన మెడికల్‌ కాలేజీలు, పోర్టులను ప్రయివేటుపరం చేస్తూ, స్కాంలు చేస్తూ తన మనుషులకు తెగనమ్ముతూ.. వీటన్నింటిపై ప్రజల్లో చర్చ జరగకూడదనే సీ ప్లేన్‌తో అభివృద్ధి జరిగిపోయినట్లు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దుర్మార్గపు చర్యలను చివరకు ప్రజలు తప్పక నిలదీస్తారని, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

1 చంద్రబాబు గురించి చెప్పాలంటే.. మాయ చేస్తాడు, మభ్యపెడతాడు, చివరకు ప్రజలను మోసం చేస్తాడు. ఇందుకోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలూ వేస్తాడు. తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకూ సీ ప్లేన్‌ ద్వారా చేసిన పర్యటన ఇలాంటిదే. సెల్‌ ఫోన్‌ తానే కనిపెట్టానని, కంప్యూటర్లు కూడా తానే కనిపెట్టానని రెండు దశాబ్దాలుగా కబుర్లు చెబుతున్న చంద్రబాబు, ఇప్పుడు సీ ప్లేన్‌ మీద కూడా కహానీలు మొదలెట్టేశారు. దేశంలోనే తొలిసారి అన్నట్టుగా, మరెక్కడా లేదన్నట్టుగా, సీ ప్లేన్‌ నడిపితే చాలు రాష్ట్రాభివృద్ధి జరిగిపోయినట్లుగా బిల్డప్‌ ఇస్తున్నారు.

2 సీ ప్లేన్‌ అన్నది ఇప్పటిది కాదు. దాదాపు 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచింది. మన దేశంలో కేరళలో 2013లో మొదలయ్యి తర్వాత నిలిపేశారు. గుజరాత్‌లో 2020లో సర్వీసులు నడవటం మొదలుపెట్టినా అవికూడా పలుమార్లు నిలిచిపోయాయి. ప్రతి రాష్ట్రంలోనూ అనేక రిజర్వాయర్లు, డ్యాంలు ఉన్నాయి. మరి ఎందుకు ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు కొనసాగడం లేదు?

3 ఆపరేషన్స్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదు­ర్కొంటున్నారని, సాంకేతిక సమ­స్యలు, ప్రయా­ణికుల భద్రతాపరమైన అంశాలతోపాటు నిర్వహణా భారం దీనికి ప్రధాన కారణాలని అనేక మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఇలాంటి 14 మంది ప్రయాణికుల సీ ప్లేన్‌ సర్వీసులను అభివృద్ధికి ఒక ప్రమాణంగా చంద్రబాబు గొప్పగా చెప్పుకోవడం, దాన్ని ఎల్లో మీడియా కీర్తించడం.. పరస్పరం డప్పాలు కొట్టుకోవడం కాదా?

4 సంపద సృష్టించడమంటే ప్రభుత్వ రంగంలో పోర్టులు నిర్మించి, తద్వారా అభివృద్ధి చేసి.. ప్రభుత్వానికి ఆదాయం కల్పించడం. ప్రభుత్వ రంగంలో మెడికల్‌ కాలేజీలు కట్టి, ప్రజలకు అందుబాటులో ఉచితంగా నాణ్యమైన, అత్యాధునిక వైద్యాన్ని అందించడం. ఇలాంటివి కాకుండా సీ ప్లేన్‌ మీద పబ్లిసిటీ స్టంట్లు ఏమిటి?

5 చంద్రబాబూ.. రూ.8,480 కోట్లతో ప్రభుత్వ రంగంలో, మారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెస్తూ, తద్వారా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని తీసుకొస్తూ, కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కట్టడం సంపద సృíష్టి అవుతుందా? లేక వాటిని ప్రయివేటు పరం పేరుతో మీ మనుషులకు స్కామ్‌లు చేస్తూ అమ్మాలనుకోవడం సంపద సృష్టి అవుతుందా?

6 సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకుని మెరుగైన వాణిజ్యాన్ని, రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని, ప్రజలకు ఉపాధిని, పారిశ్రామిక ప్రగతిని సాధించడానికి ప్రభుత్వ రంగంలో రూ.4,361.91 కోట్లతో మూలపేట, రూ.5,156 కోట్లతో మచిలీపట్నం, రూ.3,736.14 కోట్లతో రామాయపట్నం వద్ద.. మొత్తంగా మూడు పోర్టులను రూ.13,254.05 కోట్లతో నిర్మిస్తే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా? లేక సీ ప్లేన్‌లో తిరిగి ఈ పోర్టుల ఆస్తులను మీ వారికి స్కామ్‌ల ద్వారా తెగనమ్మితే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా? ప్రభుత్వ రంగ పోర్టుల వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందా? లేక ఈ సంపద సృష్టించే వనరులను తెగనమ్మడంతో పాటు, సీ ప్లేన్స్‌ వల్ల రాష్ట్రానికి సంపద పెరుగుతుందా?

7 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, పోర్టుల రూపేణా మొత్తంగా రూ.21,734 కోట్ల పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రజల ఆస్తి కాదా? ప్రజల కోసం సృష్టించిన సంపద కాదా చంద్రబాబూ? రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ రంగంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడైనా పెట్టారా? మా హయాంలో నిర్మాణాలు జరుపుకున్న కాలేజీలు, పోర్టులన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఇవాళ రాష్ట్ర ప్రజల కళ్ల ముందు లేవా? ఇవన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సృష్టించిన సంపద కాదా? ఈ ఆస్తులు విలువ భవిష్యత్తులో రూ.లక్షల కోట్లు కాదా? ఇదంతా అభివృద్ధి కాదా?

8 చంద్రబాబూ.. మీరు, మీ పార్టీ నాయకుల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధిగా.. మీరు, మీమనుషులు ఆస్తులు కూడబెడితే అది ప్రజల కోసం సృష్టించిన సంపదగా చెప్పుకుంటారు. మీ దృష్టిలో అభివృద్ధి, సంపద సృష్టి అంటే ఇదే. మీ పబ్లిసిటీ విన్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ రంగంలో మంచి స్కూల్స్‌ లేకుండా చేసి, మంచి వైద్యాన్ని అందించే మెడికల్‌ కాలేజీలు లేకుండా చేసి, మంచి పోర్టులు లేకుండా చేసి, చివరకు ప్రజల ఆస్తులను వారికి కాకుండా చేసే దుర్మార్గపు చర్యలను ప్రజలు తప్పక నిలదీస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement