సాక్షి, శ్రీకాకుళం: ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేసి.. ప్రతిపక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీలోకి ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాము స్పీకర్‌ను కోరామని, కానీ స్పీకర్ మాత్రం చంద్రబాబు డైరెక్షన్‌లో నడుచుకుంటూ.. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీ ఈ విషయంలో కోర్టుకు వెళ్లిందని, స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తాము కోర్టుకు వెళ్లాల్సిన అసవరం ఏముందని ధర్మాన ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలను రేపటిలోగా సస్పెండ్ చేయాలని ధర్మాన డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను రేపటిలోగా అనర్హులుగా ప్రకటిస్తే.. ఎల్లుండి నుంచి తమ సభ్యులు సభకు వస్తారని తెలిపారు. రెండువేల జీవోలను రహస్యంగా విడుదల చేసిన ఘనత చంద్రబాబుదని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు రాక్షస పాలన గురించి చెప్పుకోవడానికి ప్రజలు పెద్దసంఖ్యలో వైఎస్ జగన్ పాదయాత్రకు తరలివస్తున్నారని ధర్మాన అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి రూ. 97వేల కోట్ల అప్పు వస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ. లక్షకోట్లకుపైగా అప్పు చేశారని మండిపడ్డారు. ప్రజల సొత్తును చంద్రబాబు తన తాబేదారులకు కట్టబెడుతున్నారని, ఈ దోపిడీని పాదయాత్ర ద్వారా జగన్ ప్రజలకు వివరిస్తున్నారని ధర్మాన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment