సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాట ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలకు గట్టి షాక్ తగిలింది. శశికళ వర్గం అభ్యర్థి, ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్.. ఆ రెండు పార్టీల అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించి 40 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో డీఎంకే, బీజేపీ సహా 58 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌కే నగర్ నుంచి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని కూడా దినకరన్ అధిగమించి సత్తా చాటారు. జయలలిత మరణంతో డిసెంబర్ 21న ఆర్‌కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. తమిళనాడుకు భిన్నంగా.. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది.
మొత్తం 19 రౌండ్లలోనూ దినకరన్ తన ఆధిక్యతను చాటుకుంటూ వచ్చారు. ప్రతి రౌండులోనూ కనీసం 2 వేల ఆధిక్యంతో ముందంజలో నిలిచారు. ఆర్‌కే నగర్ నియోజకవర్గంలో మొత్తం 2,28,234 ఓట్లు ఉండగా 1,76,885 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో 89,013 (50.32 శాతం) ఓట్లను దినకరన్ గెలుచుకున్నారు. అన్నా డీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌కు 48,306 (27.31శాతం), డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్‌కు 24,651 (13.94శాతం) ఓట్లు పోలయ్యాయి. నామ్ తమిళర్ కట్చికి 3,860 ఓట్లు, బీజేపీకి 1,417 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి కంటే నోటాకు 2,373 ఓట్లు దక్కడం విశేషం. ఉప ఎన్నికల్లో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రెండాకుల గుర్తును సీఎం కె.పళని స్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంతో ప్రెషర్ కుక్కర్ గుర్తుపై బరిలోకి దిగారు. ఫలితాల అనంతరం దినకరన్ మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. దినకరన్ గెలుపుతో అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అధికార పక్షానికి చెందిన పదిమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా..
అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లే సమయంలో దినకరన్‌కు శశికళ అన్నాడీఎంకే నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయనను పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా నియమించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దినకరన్‌ను అరెస్టు చేశారు. అనంతర పరిణామాల్లో దినకరన్, శశికళను పక్కనపెట్టి పళని, పన్నీరు వర్గాలు ఈ ఏడాది ఆగస్టులో ఏకమయ్యారు. దీంతో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో దినకరన్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జయలలిత ఉన్న సమయంలో పార్టీ నియామకాలు, ఎన్నికల సమయంలో మిత్రపక్షాలతో చర్చల్లో దినకరన్ కీలక పాత్ర పోషించారు. 1999లో పెరియాకులం నుంచి లోక్‌సభకు, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలదే గెలుపు
పశ్చిమ బెంగాల్‌లోని సబంగ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 64 వేల ఓట్ల మెజార్టీతో తృణమూల్ అభ్యర్థి గీతా రాణి భునియా గెలుపొందారు. ఆమెకు మొత్తం 1,06,179 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి రీతా మండల్‌కు 41,987 ఓట్లు దక్కాయి. యూపీలో సికందర అసెంబ్లీ స్థానాన్ని అధికార బీజేపీ నిలబెట్టుకుంది. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ పాల్ 11 వేల ఓట్లతో సమాజ్‌వాదీ అభ్యర్థి సీమా సచన్‌పై విజయం సాధించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లోని పాక్కే–కసాంగ్, లికాబలీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోను బీజేపీ గెలుపొందింది. ఈ రెండు స్థానాల్ని కాంగ్రెస్ నుంచి అధికార బీజేపీ సొంతం చేసుకుంది.
అన్నాడీఎంకేపై పట్టు సాధిస్తారా?
తమిళనాడు రాజకీయాలు ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితాలతో మరో మలుపు తిరిగేలా కనిపిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే ఆగ్రహానికి గురై ఈ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ భారీ ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్నారు. «రాష్ట్ర రాజకీయాల్లో ఆయన సరికొత్త కేంద్రబిందువుగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జయలలిత హయాంలో దినకరన్ పేరు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఆమె మరణించాక, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆ సందర్భంలో తన అక్క కొడుకైన దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమించడంతో ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు తమ వర్గానికి రెండాకుల చిహ్నం రావడం కోసం దినకరన్ ఏకంగా ఎన్నికల సంఘం (ఈసీ)లోని ముఖ్యులకే రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపారు. తీహార్ జైలుకు కూడా వెళ్లారు.
ఆ తర్వాత శశికళ వర్గం నుంచి సీఎం అయిన పళనిస్వామి కూడా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంతో చేతులు కలిపి శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీచేసి భారీ విజయం సాధించారు. దినకరన్ విజయంతో తమిళ రాజకీయ సమీకరణాలు మరోసారి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరుతారా? ఆ పార్టీని శశికళ, దినకరన్‌లు మళ్లీ తమ చేతుల్లోకి తెచ్చుకుంటారా? దినకరన్ గెలుపుతో మరోసారి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? అన్న విషయం చర్చనీయాంశమైంది. దినకరన్ డీఎంకేతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికలో గెలిచారని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను స్టాలిన్ ఖండిస్తునప్పటికీ ఒకవేళ అదే నిజమైతే దినకరన్ డీఎంకేలో చేరుతారా? లేదా ఆ పార్టీకి అనుబంధంగా ఉంటారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం మరికొంత కాలం వేచిచూడాల్సిందే.
చెన్నైలో దినకరన్ మద్దతుదారుల సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment