సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత ఆకస్మిక మరణానికి శశికళే కారణమంటూ ప్రచారం ఓవైపు.. ఎన్నికల కమిషన్‌కి లంచం ఇవ్వజూపిన కేసులో జైలుకెళ్లిన అప్రతిష్ట మరోవైపు.. పళనిస్వామి ప్రభుత్వానికి పుష్కలంగా కేంద్రం అండదండలు, డీఎంకేకు సమర్థమైన నాయకత్వం.. ఇవేవీ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ (శశికళ సోదరి కుమారుడు) విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. దీనికితోడు ‘అమ్మ’ కంటే దినకరన్‌కే అధిక మెజారిటీని ఆర్కేనగర్ ఓటర్లు కట్టబెట్టడం, నోటాకన్నా బీజేపీకి తక్కువ ఓట్లు రావటం విస్తుపోయేలా చేసింది.
‘ఆర్కేనగర్’కు ఆర్థిక సాయం
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాతే దినకరన్ పేరు తెరపైకి వచ్చింది. శశికళకు పాదాభివందనం చేసి పార్టీ పగ్గాలు ఇచ్చిన నేతలు ఆమె జైలుపాలు కాగానే తగిన కారణం చూపకుండానే దినకరన్‌పై బహిష్కరణ వేటు వేయడం ప్రజల్లో సానుభూతి కలిగించిందని విశ్లేషకులంటున్నారు. అదే సమయంలో తమ పదవులు కాపాడుకోవడమే ధ్యేయంగా పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు విలీనం కావడం విమర్శలకు దారితీసింది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపి జైలుకు వెళ్లిన దినకరన్.. తిరిగొచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ.. నేతలను, కార్యకర్తలను చేరదీశారు. ఆర్కే నగర్‌లో ఎక్కువ మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే.
దీంతో దినకరన్ తన సొంత డబ్బుతో స్థానిక ప్రజల రుణాలు తీర్చినట్లు తెలుస్తోంది. జయ మరణం తర్వాత ఓసారి ఉపఎన్నిక రద్దవటం, పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్నా.. దినకరన్ వెనుకంజ వేయలేదు. తన అనుచరుల ద్వారా అక్కడి పేదలకు సాయం చేస్తూ సంబంధాలు కొనసాగించినట్లు తెలిసింది. ఎన్నికకు ముందు రోజు వ్యూహాత్మకంగా ఓ వీడియో రిలీజ్ అయ్యింది. అందులో ఆస్పత్రిలోని బెడ్‌పై జయలలిత జ్యూస్ తాగుతున్నట్లు కనిపించారు. ఇది కూడా శశికళపై ఆగ్రహం తగ్గేందుకు కారణమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటు, ఎన్నికకు ముందురోజు దినకరన్ భారీగా డబ్బులు పంపిణీ చేసినట్లు వార్తలొచ్చాయి.
బీజేపీ పరోక్ష సాయం
ప్రాంతీయ అభిమానం మెండుగా ఉన్న తమిళ ఓటర్లు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ జోక్యాన్ని సహించలేకపోయారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనన్ ఓటమికి అసమర్థ నాయకత్వం కూడా ఓ కారణమని విశ్లేషకులు అంటున్నారు. అటు, ఆర్కేనగర్‌లో డీఎంకేకు చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉంది. అయినా కూడా ఆ పార్టీకి డిపాజిట్ రాకపోవడం గమనార్హం.
దినకరన్ గెలిస్తే అన్నాడీఎంకే ప్రభుత్వం బలహీనపడుతుందనే వ్యూహంతోనే స్టాలిన్ మిన్నకుండిపోయారనే ప్రచారం జరుగుతోంది. డీఎంకే కూడా బీజేపీ గూటికి చేరుతుందనే అనుమానాలతో ప్రజలు ఆ పార్టీకి మొండిచేయి చూపారని భావిస్తున్నారు. కరుణానిధిని మోదీ పరామర్శించడం, కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన కార్యక్రమాలను డీఎంకే విరమించుకోవడం, పోలింగ్ సమయంలోనే కనిమొళి, రాజా 2జీ కేసులో నిర్దోషులుగా తేలడం వంటివి ఆర్కే నగర్ ఓటర్లు డీఎంకేనూ పక్కన పెట్టేందుకు కారణమయ్యాయంటున్నారు.
దినకరన్.. ఇలా గెలిచెన్!
Published Thu, Dec 28 2017 2:16 AM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment