
సాక్షి, జోగులాంబ : 'కేసీఆర్ గారు ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి , చింతమడకకు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి' అని బీజేపీ మహిళా నేత డీకే అరుణ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ తాను పుట్టిన గ్రామానికి వెళ్లి అభివృద్ధి పేరుతో అక్కడ ఉన్న కుటుంబాలకు రూ. 200 కోట్లు కేటాయించడం మంచి విషయమేనని, అయితే అదే చిత్తశుద్దితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
గతంలో కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసిన కొందరు తమ స్వంత గ్రామాలను అభివృద్ధి చేసుకున్నారే తప్ప తెలంగాణకు చేసిందేమి లేదని డీకే అరుణ ఎద్దేవా చేశారు. తాజాగా ప్రజల కష్టాలు పట్టించుకోకుండా కేసీఆర్ కూడా ఇదే ధోరణి ప్రదర్శించడం శోచనీయమని వెల్లడించారు. 'రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే ప్రతి వ్యక్తి టీఆర్‌ఎస్ పార్టీకి రుణపడి ఉండాలని' రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై అరుణ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక మంత్రిగా వ్యవహరిస్తూ ఇలా మాట్లాడడం సిగ్గు చేటని, ఆయనేమైనా పెన్షన్ తన ఇంట్లో నుంచి ఇస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. మున్నిపాలిటీల్లో అడ్డగోలుగా విభజనలు చేయడం వల్లే కోర్టు మొట్టికాయలు వేస్తుందని తెలిపారు. ఇప్పటికేనా చిల్లర రాజకీయాలను మానుకోవాలని హితవు పలుకుతూ, చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడితే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని తెరాస నాయకులనుద్దేశించి డికె అరుణ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment