
హైదరాబాద్: బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయం కట్టాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు ప్రజా బ్యాలెట్ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో 97.13 మంది సెక్రటేరియట్ యథావిధిగా కొనసాగించాలని తీర్పు ఇచ్చారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించారు.
కౌంటింగ్ వివరాలు అమర్ ప్రకటించారు. మొత్తం 18,460 ఓట్లు పోలవ్వగా 17,892 మంది సెక్రటేరియట్ తరలించవద్దని, అక్కడే కొనసాగించాలని ఓటు వేసినట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇది మంచి కార్యక్రమం అని దేవులపల్లి అమర్ అన్నారు. వీహెచ్ మాట్లాడుతూ, సెక్రటేరియట్ మార్చరాదని ప్రజలు ఎంతో ఉన్నతమైన తీర్పు ఇచ్చారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు మరచి ప్రజాధనం వృథాచేసేందుకు ఉస్మానియా ఆస్పత్రి మారుస్తా, సెక్రటేరియట్ మారుస్తా అనడం సరికాదన్నారు. కేవలం వాస్తు కోసం సెక్రటేరియట్ మార్చడం సరికాదని, యాదగిరి నర్సింహస్వామి ఇప్పటికైనా కేసీఆర్‌కు ఆలోచనలో మార్పు వచ్చేలా చేయాలని అన్నారు. ఇప్పటికీ నిర్ణయం మారకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలు, ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు.