న్యూఢిల్లీ/ముంబై/బెంగళూరు: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా రాజకీయ వేడిని రాజేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందుగా అంటే ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించడంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. మోదీ బాల్యంలో టీ అమ్మడం, ఆరెస్సెస్‌లో చేరిక, గుజరాత్ సీఎంగా ఎదుర్కొన్న సవాళ్లు, సర్జికల్ దాడులుçసహా పలు అంశాలను స్పృశించిన ఈ సినిమా బీజేపీకి ఎన్నికల్లో లబ్ధి కలిగించేలా ఉందని మండిపడుతున్నాయి.
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధానపాత్రలో, బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, కిశోర్ షహానే, దర్శన్ కుమార్ తారాగణంతో ఈ సినిమాను దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాకు తాము పాటలు రాసినట్లు పోస్టర్లు వేయడంపై గీత రచయితలు జావేద్ అక్తర్, సమీర్‌లు మండిపడ్డారు. తాము ఈ సినిమాకు పాటలు రాయలేదన్నారు. 2019, ఏప్రిల్ 11న ప్రారంభంకానున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్, మే 19 వరకూ కొనసాగనుంది.
ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ఈ సినిమాపై కాంగ్రెస్ పార్టీ శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) ఫిర్యాదు చేసింది. ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా హింసను, ఆయుధాలను ప్రోత్సహించేలా ఉందని ఫిర్యాదులో తెలిపింది. మోదీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందని పేర్కొంది. పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఈ చిత్రం విడుదలపై మే 23 వరకూ నిషేధం విధించాలని సీపీఐ, ఎన్సీపీ, డీఎంకేలు ఈసీని డిమాండ్ చేశాయి.
సినిమా ప్రకటనను ప్రచురించిన దైనిక్ భాస్కర్ పత్రిక, ట్రైలర్ విడుదల చేసిన టీ–సిరీస్ కంపెనీ, నిర్మాతలకు తూర్పు ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ అధికారి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఈ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో సర్టిఫికేషన్, వ్యయానికి సంబంధించిన పత్రాలను మార్చి 25లోగా సమర్పించాలని ఆదేశించారు. ప్రకటన రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తోందని రిటర్నింగ్ అధికారి అన్నారు. ఇందుకు సంబంధించిన మొత్తం ఖర్చును అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి జతచేస్తామని నోటీసులో రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.
మా స్టైల్‌లో గుణపాఠం చెప్తాం: ఎంఎన్‌ఎస్
ఈ సినిమాను ఎన్నికలకు ముందు విడుదల చేయడంపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్) స్పందించింది. ఎంఎన్‌ఎస్‌కు చెందిన ఛిత్రపత్ సేన అమీ ఖోప్కర్‌హస్ ఈ విషయమై మాట్లాడుతూ..‘ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీన్ని ఎంఎన్‌ఎస్ ఎన్నటికీ జరగనివ్వదు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఆపేందుకు మా స్టైల్‌లో వాళ్లకు గుణపాఠం చెబుతాం’ అని హెచ్చరించారు.
సమీర్
జావేద్ అక్తర్
సుడిగుండంలో మోదీ బయోపిక్
Published Sun, Mar 24 2019 3:14 AM | Last Updated on Sun, Mar 24 2019 8:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment