సాక్షి ప్రతినిధి, విజయనగరం/శ్రీకాకుళం న్యూకాలనీ: అవినీతి, అక్రమాలు, మోసాలు తప్ప చంద్రబాబు రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, అవకాశవాద రాజకీయాలకు ఆయన నిలువెత్తు రూపమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తన అవినీతిపాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరగాయని ఆరోపించారు. ‘జనచైతన్య’, ‘సత్యమేవ జయతే’ పేర్లతో రాష్ట్రంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా విజయనగరం మెసానిక్ టెంపుల్‌లో సోమవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర పార్లమెంటరీ నియోజకవర్గాల శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని పలాస పట్టణంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టనున్న ప్రజాచైతన్య బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి హాజరయి ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తాము సూచనప్రాయంగా చెప్పినప్పుడు చంద్రబాబు ప్యాకేజీకే మొగ్గు చూపించారని అమిత్‌షా కుండ బద్దలుగొట్టారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు సమక్షంలోనే ప్యాకేజీకి అంగీకరించారని బాబు బండారాన్ని బహిర్గతం చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, భారతదేశంలో యూటర్న్‌కు మారుపేరుగా ఏపీ సీఎం నిలుస్తారని ఎద్దేవా చేశారు.శాసనసభలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత అభినందన తీర్మానం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కేంద్ర నిధుల దుర్వినియోగం..
ఏపీకి ఇప్పటివరకు రూ. 5.56 లక్షల కోట్ల నిధులు ఇచ్చామని అమిత్ షా స్పష్టం చేశారు. 14 జాతీయ సంస్థలను కేటాయించామని, అనేక రాయితీలను, పథకాలను అమలు చేశామన్నారు. కేంద్ర నిధులను చంద్రబాబు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని, విదేశాలు తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల బీజేïపీ పాలనలో ఏపీ అభివృద్ధకి పదింతల నిధులిచ్చామని, ఇది నిజం కాదని నిరూపించగలరా? అని చంద్రబాబుకు సవాలు విసిరారు. విభజన బిల్లులోని 14 అంశాల్లో ప్రధానమైన 9 అంశాలను ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చేశామన్నారు.ప్యాకేజీకి చంద్రబాబు మొగ్గు చూపిన తర్వాత.. నిధుల విడుదలకు తగిన ప్రణాళికలు ఇవ్వాలని ప్రధాని మోదీ తనను కలసిన ప్రతీసారి చెప్పారని, అయితే చంద్రబాబు ఆ పని చేయకుండా నాటకాలు ఆడారని మండిపడ్డారు.
మహిళా కార్యకర్తను అవమానించిన తీరును మర్చిపోం..
కాంగ్రెస్‌పై వ్యతిరేకతలో పుట్టిన తెలుగుదేశం పార్టీని అదే కాంగ్రెస్ కాళ్లవద్ద చంద్రబాబు పెట్టి ఎన్టీఆర్ ఆత్మ క్షోభింపచేశారని అమిత్ షా పేర్కొన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం ఒక లెక్కా అని దుయ్యబట్టారు. తెలంగాణలో ఓటమిని చూసి ఇప్పుడు మహాకూటమంటూ రాష్ట్రాలు తిరుగుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మరలా అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు మళ్లీ ఎన్‌డీఏలో కలుస్తానంటూ వస్తారని, అప్పుడు ఆయనకు బీజేపీ తలుపులు మూసి ఉంటాయని స్పష్టం చేశారు. బీజేపీ మహిళా కార్యకర్తను చంద్రబాబు అవమానించిన తీరు తామెవరం మర్చిపోమని, ఇకపై అలాంటివి సహించేది లేదని షా హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనను ప్రజలకు తెలియజేయడం కోసమే బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీలు కుటుంబ పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. తమకు అధికారం కట్టబెట్టాలని ప్రజలను కోరారు.
అప్పుల ఊబిలోకి రాష్ట్రం..
రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన నిధులు అవినీతిపరుల పాలయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడడానికి ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. జాతీయ మహిళామోర్చ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ బూత్ కమిటీలు బలోపేతం కావాలని, రాష్ట్రానికి బీజేపీ చేసిన అభివృద్ధిని సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. తెలుగు డ్రామా కంపెనీగా టీడీపీ మారిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇసుక దోపిడీ, పింఛన్లు, రేషన్ కార్డుల్లో అక్రమాలు, ప్రాజెక్టుల్లో అవినీతితో సంపాదించిన వేల కోట్ల రూపాయలతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని టీడీపీ భావిస్తోందని విమర్శించారు. కాగా, అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించాయి. కార్యక్రమం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో పలువురు పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ దేవ్‌దర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, వివిధ విభాగాల రాష్ట్ర ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
అవినీతి, అక్రమం, మోసం.. ఇదే చంద్రబాబు రూపం
Published Tue, Feb 5 2019 2:32 AM | Last Updated on Tue, Feb 5 2019 10:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment