సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలు (జమిలి) జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలు వర్గాలు కోరుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు తీసుకరావాలని, వాటితోపాటు సామాజిక, ఆర్థిక అంశాలకు చెందిన మరో 15 ప్రశ్నలపై తమ అభిప్రాయాలేమిటని ఎన్నికల కమిషన్‌ను లా కమిషన్ ఇటీవల ఓ నివేదికలో కోరింది. పాతికేళ్ల క్రితం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం మంచిదని సిఫార్సు చేసిన లా కమిషన్ ఇప్పుడు తాజాగా అదే అంశంపై ఎన్నికల కమిషన్ అభిప్రాయలను కోరింది.
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి బదులుగా ఓ సంవత్సరంలో జరగాల్సిన ఎన్నికలన్నింటిని కలిపి ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం సముచితమని, అందుకు రాజ్యాంగ సవరణలు కూడా అనవసరమని భావించినట్లు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం దేశంలోని రాష్ట్ర అసెంబ్లీలకు ఎప్పుడు గడువు ముగిసి పోతే అప్పుడే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. అందుకు కారణం అసెంబ్లీ గడువు ముగిసిపోవడానికి ఆరు నెలల ముందు ఎన్నికలు ప్రకటించరాదని ‘ప్రజా ప్రాతినిథ్యం చట్టం–1951’లోని 15వ సెక్షన్ తెలియజేస్తోంది. అందుకనే 2017లో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించగా, ఓ ఏడాదిలో పలు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నా, అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించాలన్నా ఆర్నెళ్లకు ముందుగా ఎన్నికలు నిర్వహించరాదన్న ప్రజాప్రాతినిథ్య చట్టంలోని నిబంధనను కనీసం తొమ్మిది నెలలకు మార్చాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు భావించాయి.
Comments
Please login to add a commentAdd a comment