నాడు శత్రువులు.. నేడు మిత్రులు | Enemies Become friends in Khairatabad | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 18 2018 10:36 AM | Last Updated on Sun, Nov 18 2018 11:21 AM

Enemies Become friends in Khairatabad - Sakshi

బంజారాహిల్స్‌: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు/శత్రువులు ఉండరు. అందుకు ఈ రెండు ఉదంతాలే నిదర్శనం. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ సీబీఐ డైరెక్టర్‌ విజయరామారావు టీడీపీ నుంచి ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి దానం నాగేందర్‌ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ పార్టీల పరంగా బద్ధ శత్రువులు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరినీ టీఆర్‌ఎస్‌ ఒక్కటి చేసింది.

ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌కు ఖైరతాబాద్‌ టిక్కెట్‌ కేటాయించగా టీఆర్‌ఎస్‌లోనే ఉన్న విజయరామారావు మద్దతు కావల్సి వచ్చింది. దీంతో నాగేందర్‌ శనివారం విజయరామారావు ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 2009లో ఇద్దరూ పోటీపడ్డ విషయాన్ని సరదాగా గుర్తుచేసుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో వైస్సార్‌సీపీ అభ్యర్థిగా విజయారెడ్డి పోటీ చేశారు. ఆమెపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ బరిలో నిలిచారు. ఈ ఇద్దరు హోరాహోరీ తలపడ్డారు. ఈ ఎన్నికల అనంతరం విజయారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా గెలిచారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌కు ప్రస్తుతం ఖైరతాబాద్‌ టిక్కెట్‌ దక్కడంతో.. నాడు పోటీలో నిలిచి ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న విజయారెడ్డి వద్దకు వెళ్లి ఆమె మద్దతు కోరారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని ఈ రెండు సంఘటనలు కళ్లకు కట్టాయి.

తొలి మహిళా మంత్రి హైదరాబాదీ
పరదా ధరించే సంప్రదాయం.. మగవాళ్ల మధ్యలోకి రావద్దంటూ ఆంక్షలు..ఆపై రజాకార్ల ఆగడాలు.. ఇంతటి ఆంక్షల చట్రంలోనూ ఉన్నత చదువులు పూర్తిచేసి, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు మాసుమా బేగం! హైదరాబాదీ అయిన మాసుమా బేగం చిన్నప్పట్నుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజిని నాయుడుతో పరిచయం ఏర్పడింది. 1928లో బొంబాయిలో తొలిసారిగా నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్‌ స్టేట్‌లో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన కమ్యూనిస్టు యోధుడు మఖ్దూం మొహియుద్దీన్‌పై 780 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. మొహియుద్దీన్‌ పీడీఎఫ్‌ టికెట్‌పై.. మాసుమా బేగం కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి  బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాసుమా బేగం డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేశారు. ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్రాల విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో çఫత్తర్‌గట్టి నుంచి శాసనసభ్యురాలిగా విజయం సాధించారు. 1960లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రభుత్వంలోనూ మాసుమా బేగం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement