
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పాలనలో మైనారిటీ విద్యా సంస్థలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, వారి విద్యా సంస్థలకు మైనారిటీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి పేద విద్యార్థులను ఆదుకుంటామన్నారు. సోమ వారం ఫెడరేషన్ ఆఫ్ మైనారిటీ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజాం క్లబ్ మైనారిటీ ప్రొఫెషనల్ స్కూల్స్, కాలేజీస్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తమ్‌కు విద్యా సంస్థల ప్రతినిధులు తమ డిమాండ్లను విన్నవించారు.
కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీ విద్యా సంస్థలకు మైనారిటీ హోదా ఇవ్వకుండా వేధిస్తోందని, తమ డిమాండ్లను కాంగ్రెస్ పరిష్కరిస్తే అండగా ఉంటామని చెప్పారు. మైనారిటీ విద్యా సంస్థలను అధ్వానం చేశారని, దాదాపు 85 శాతం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూతబడ్డాయని చెప్పారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. మైనారిటీ విద్యా సంస్థల్లో 70 శాతం మైనారిటీలు, 30 శాతం నాన్ మైనారిటీలు ఉండటంతో చాలా కాలేజీల్లో విద్యార్థుల్లేక నష్టపోతున్నారన్నారు. మైనారిటీలు లేని విద్యా సంస్థల్లో నాన్ మైనా రిటీలను చేర్చుకునేలా అవకాశం కల్పిస్తామన్నారు. ఎన్నికల ముందు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న టీఆర్‌ఎస్.. కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు.
మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా జోషి
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ముషీరాబాద్‌కు చెందిన జాయ్ జోషిని నియమిస్తూ మైనారిటీ విభాగం చైర్మన్ ఫక్రుద్దీన్ సోమవారం నియమాక పత్రం విడుదల చేశారు. రాబోయే ఎన్నికల్లో మైనారిటీలు కాంగ్రెస్‌కు అండగా ఉండి గెలిపించాలని కోరారు.
మాకూ సీట్లివ్వండి: ఆర్య వైశ్య మహాసభ
రాష్ట్రంలో 7 శాతం (28.60 లక్షలు) ఉన్న ఆర్య వైశ్యులకు తగినన్ని సీట్లు కేటాయించాలని ఆర్య వైశ్య మహాసభ ప్రతినిధులు ఉత్తమ్, భట్టి విక్రమార్కలను కోరారు. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి కాలువ సుజాత ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్య వైశ్య మహాసభ నేతలు మల్లికార్జున్ ఉత్తమ్, భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. తాండూరు, మెదక్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో తమకు ఎక్కువ బలం ఉన్నందున ఆ స్థానాలు కేటాయించాలని కోరారు. రూ. 1,000 కోట్లతో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment