సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన అనూహ్య ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని విస్తరించాలని నిర్ణయించుకున్న బీజేపీ చూపు కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై పడింది. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బండి సంజయ్‌కుమార్ ఘన విజయం నేపథ్యంలో ‘ఆపరేషన్ ఆకర్ష’ను ఈ జిల్లా నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ జాతీయ నేత రాంమాధవ్ ఈ మేరకు హైదరాబాద్‌లో మకాం వేసి వ్యూహం రూపొందిస్తున్నారు. తొలుత కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతి నిధులను పార్టీలోకి తీసుకొనే ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశంలో మిగిలిన ఒకరిద్దరు ప్రముఖ నాయకులను పార్టీలోకి ఆహ్వానించే ఆలోచనతో బీజేపీ నాయకత్వం ఉంది. ఈ రెండు పార్టీల కథ ముగిసిన తరువాతే అధికార టీఆర్‌ఎస్‌పై గురి పెట్టనున్నారు.
చారిత్రాత్మక తప్పిదంగా భావిస్తున్న వివేక్
పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధిష్టానం మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు టికెట్టు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో చెన్నూరు అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బొర్లకుంట వెంకటేశ్ నేతను టీఆర్‌ఎస్‌లోకి తీసుకొని పెద్దపల్లి టికెట్టు ఇచ్చారు. ఈ ప్రక్రియలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక పాత్ర పోషించగా, మిగతా ఎమ్మెల్యేలు సహకరించారు. అదే సమయంలో బీజేపీ వివేక్‌పై కన్నేసింది. జాతీయ నేత రాంమాధవ్ స్వయంగా వివేక్‌తో మాట్లాడి హైదరాబాద్ పిలిపించుకొని పెద్దపల్లి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయమని కోరారు. అప్పటికే జాతీయ నాయకత్వం పెద్దపల్లి టికెట్టును ఎస్.కుమార్‌కు ప్రకటించినప్పటికీ, వివేక్ కోసం బీఫారంను నామినేషన్ల చివరి రోజు వరకు ఆపారు.
అయితే అప్పటివరకు టీఆర్‌ఎస్‌లో ఉన్న తాను బీజేపీ నుంచి పోటీ చేస్తే ఓట్లు పోలవుతాయో లేదోనని భయపడ్డ వివేక్ పోటీకి నిరాకరించారు. తనకు బదులు సోదరుడు వినోద్‌కు సీటివ్వమని కోరగా, అందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. చివరికి ఫలితాల్లో అనూహ్యంగా చివరి నిమిషంలో ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావు ఘన విజయం సాధించారు. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లలో బీజేపీ విజయఢంకా మోగించింది. పెద్దపల్లి నుంచి పోటీ చేస్తే తాను కూడా గెలిచేవాడినని ఫలితాల అనంతరం ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బీజేపీ బలమైన శక్తిగా మారుతుందని భావించిన ఆయన ఆపార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఇటీవల రాంమాధవ్‌ను కలిసి తన అభీష్టాన్ని తెలియజేసినట్లు సమాచారం. వివేక్ చేరికను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ప్రోత్సహిస్తున్నారు.
రాంమాధవ్‌ను కలిసిన రమ్యారావు
కేసీఆర్ కుటుంబానికి చెందిన రేగులపాటి రమ్యారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో బుధవారం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో పార్టీ నేత రాంమాధవ్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ గత ఎన్నికల ముందు రాజీనామా చేసిన రమ్యారావు ఏ పార్టీలో చేరలేదు. వారం రోజుల్లో బీజేపీలో చేరనున్నట్లు ఆమె ధ్రువీకరించారు. రాష్ట్రంలో టీడీపీ ఉనికిలో లేకుండా పోవడంతో ఆ పార్టీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన పార్టీ అగ్రనేతలను కలిశారు. వీరితోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాయకత్వ లేమి ఉన్న కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకులను చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో..
కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన బండి సంజయ్‌కుమార్ నేతృత్వంలోనే కొత్త చేరికలకు ముహూర్తం ఖరారు కానున్నట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సంజయ్ శుక్రవారం ఢిల్లీకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బీజేపీలోకి ఎవరిని ఆహ్వానిస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే విషయాన్ని ఆయన అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ప్రజాబలం ఉన్న నాయకులను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్న ఆయన ఆ మేరకు ఓ జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ చేరికల తరువాత టీఆర్‌ఎస్‌కు చెందిన అసంతృప్తి వాదులు, మాజీలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment