నేను ఏ పార్టీ సభ్యుడిని కాదు | Gaddar Meet Rahul Gandhi And Sonia Gandhi In New Delhi | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 13 2018 1:30 AM | Last Updated on Mon, Oct 22 2018 9:20 PM

Gaddar Meet Rahul Gandhi And Sonia Gandhi In New Delhi - Sakshi

శుక్రవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో గద్దర్‌. చిత్రంలో గద్దర్‌ భార్య, కుమారుడు ∙

సాక్షి, న్యూఢిల్లీ: తాను కాంగ్రెస్‌లో చేరట్లేదని, లౌకిక శక్తులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటానని ప్రజా గాయకుడు గద్దర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చిన నయా ఫ్యూడల్‌ వ్యవస్థపై తాను పోరాటం చేస్తానని పేర్కొన్నారు. ప్రతిపక్షపార్టీలు, ప్రజలు కోరితే గజ్వేల్‌లో స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో గద్దర్, ఆయన సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్‌ శుక్రవారం సమావేశమైన అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో నయా ఫ్యూడలిజం
‘తెలంగాణలో భూమి ఇస్తామన్నారు. ఇవ్వ లేదు. ఇళ్లు ఇస్తామన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవ్వలేదు. దళితుడిని ముఖ్య మంత్రిని చేస్తామన్నారు. చేయలేదు. తెలంగాణలో నయా ఫ్యూడలిజం వచ్చింది. దేశంలో గ్రామీణ భారతం, పట్టణ భారతం, సామ్రాజ్య వాద భారతం ఉంది. దీనిలో మార్పు కావాలని చెప్పాను. దీనికి రాహుల్‌ గాంధీ స్పందిస్తూ మార్పు తెచ్చేందుకు మా పార్టీలో చేరతారా అని అడిగారు. నేను ఏ పార్టీలోనూ చేరను. ఏ పార్టీ సభ్యుడిని కాను. నేను ప్రజా గాయ కుడిని. జీవితమంతా ప్రజల కోసం పాట పాడినవాడిని. మీరు ముందుకెళ్లండి మీ వెంట ఉంటానని చెప్పాం’ అని వివరించారు. కాగా, రాహుల్‌ గాంధీకి తన లక్ష్యాన్ని గద్దర్‌ పాటల ద్వారా వివరించారు. ‘భారత దేశం భాగ్యసీమ రా.. సకల సంపదకు కొదవ లేదురా.. బంగరు పంటల భూములున్నయీ.. చావులేని మరి జీవనదులున్నయి.. అంగట్లోనా అన్ని ఉన్నయీ అల్లుని నోట్లో శని ఉన్నట్టు.. సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రమెట్లుందో మా యన్న ల్లారా’  అన్న పాటను హిందీలో వినిపించారు.

మీడియా ప్రశ్నలు.. గద్దర్‌ సమాధానాలు..
ప్రశ్న: కాంగ్రెస్‌ ఫ్యూడల్‌ పార్టీ అని గతంలో అన్న మీరు ఆ పార్టీతో ఎలా కలసి పనిచేస్తారు?
గద్దర్‌: దేశంలో ఒక ప్రమాదకర పరిస్థితి వచ్చింది. ఇక్కడ జరగబోయే యుద్ధాలు మతోన్మా దులు, లౌకిక శక్తుల మధ్యే. హిందూ మతంలో కూడా ప్రజాస్వామ్యం ఉంది. ఎన్ని దేవుళ్లనైనా మొక్కొచ్చు. కానీ కొందరు మతోన్మాదులు ఢిల్లీని పాలించాలని చూస్తున్నారు. ప్రజలకు, సెక్యులర్‌ రాజకీయ పార్టీలకు నేను వారధిగా ఉండాలనుకుంటున్నాను. ఢిల్లీ పాలన సెక్యులర్‌ శక్తుల మధ్యే ఉండాలని ఆశిస్తున్నా. ఒక్క రాహుల్‌నే కాదు.. దేశంలో ఉన్న సెక్యులర్‌ శక్తులను కలుస్తా.. నచ్చింది తింటే చంపేస్తవు.. కవులు మాట్లాడితే చంపేస్తవు.. గద్దర్‌ పాట పాడుతుంటే చంపేస్తవ్‌.. అందు వల్ల ఢిల్లీని పాలించాల్సింది సెక్యులర్‌ శక్తులు. వెంట్రుక వాసి ఉన్న యునైటెడ్‌ ఫ్రంట్‌ను నిర్మిస్తా..
ప్రశ్న: రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ఎప్పటి నుంచి మొదలవుతుంది..
గద్దర్‌: ఏడాదిగా నడుస్తోంది. మేం ఒక పథకం ప్రకారం చేయాలనుకుంటున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో దీనిపై ‘నిచ్చెన మెట్లు’పేరుతో ఒక నాటకం ప్రదర్శిస్తున్నాం. రాహుల్‌ గాంధీని రావాలని అడిగాం..
ప్రశ్న: ఆ శక్తులపై పోరాటం కోసం కేసీఆర్‌పై పోటీ చేయాలని వస్తున్న డిమాండ్‌పై మీ స్పందన ఏంటి?
గద్దర్‌: కేసీఆర్‌ మీద పోటీ చేయాలని ప్రజలు అంటున్నరు. అక్కడున్న రాజకీయ పార్టీలు అనాలి. నాకు కేసీఆర్‌ మీద పోటీ చేయడమే లక్ష్యం కాదు. అక్కడ వస్తున్న నయా ఫ్యూడలిజాన్ని ఓడించాలన్నదే నా లక్ష్యం. అందువల్ల అక్కడ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుకుంటే తప్పనిసరిగా ఆమోదిస్తా.
ప్రశ్న: రాహుల్‌ గాంధీతో దీనిపై చర్చించారా?
గద్దర్‌: లేదు. దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు.
ప్రశ్న: మీరైతే పోటీకి సిద్ధంగా ఉన్నారు.
గద్దర్‌: ఫ్యూడలిజం తగ్గించాలన్నదే నా లక్ష్యం. 
ప్రశ్న: దీనికోసం మీరు ఇంకొక ఫ్యూడల్‌ పార్టీని ఎంచుకోవాలా?
గద్దర్‌:అలా అయితే నేను పార్టీలో చేరే వాడిని కదా.. నేను ఇండిపెండెంట్‌.
ప్రశ్న: మీ కుమారుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. మీరు ఇండిపెండెంట్‌గా వ్యవహరించడ మంటే.. 
తటస్థత ఎక్కడుంది?
గద్దర్‌: రాజకీయాల్లో ఎవరి ఫిలాసఫీ వారిది. 
ప్రశ్న: ఒకప్పుడు బుల్లెట్‌ను నమ్మిన గద్దర్‌.. ఇప్పుడు బ్యాలెట్‌ వైపు చూడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
గద్దర్‌: అభివృద్ధే అనుకో.. ఎప్పుడూ 24 గంటలు బుల్లెట్‌ కొట్టడమే ఉండదు. ఓటు ఒక విప్లవ రూపమైతది. ఓటు ఒక రహస్య రాజ కీయ నిర్మాణం అవుతుంది. ఓటు రాజకీయా లను మార్చేది కూడా అవుతుంది. కాబట్టి ఓట్ల విప్లవానికి సిద్ధం కావాలని అంటున్నా.
ప్రశ్న: మావోయిస్టులకు మీరు పిలుపునిస్తున్నారా ఓట్ల ప్రజాస్వామ్యంలోకి రమ్మని?
గద్దర్‌: నేను పిలవడం లేదు. అది మావోయిస్టుల ఇష్టం.
ప్రశ్న:: కాంగ్రెస్‌కు అనుకూలంగా మీరు ప్రచారం చేయబోతున్నారా?
గద్దర్‌: కాంగ్రెస్‌కు అనుకూలంగా అని చెప్ప లేదు. అలా అనుకుంటే ఆ పార్టీలోనే చేరేవాడిని కదా..

దొరల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించండి 
దొరల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే బాధ్యతను కాంగ్రెస్‌ తీసుకోవాలని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీని ప్రజా గాయకుడు గద్దర్‌ కోరారు. శుక్రవారం తన సతీమణి విమల, కుమారుడు సూర్య కిరణ్‌లతో కలసి సోనియాగాంధీని ఢిల్లీలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సోనియా ఇచ్చిన తెలంగాణ దొరల చేతుల్లోకి పోయిందని, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని సోనియాకు వివరించినట్లు సమావేశం అనంతరం గద్దర్‌ తెలిపారు. ఇప్పుడు దొరల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే బాధ్యతను కాంగ్రెస్‌ తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని 50 వేల మంది కళాకారులతో స్వాగతం పలికేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా సోనియాను ఆహ్వానించినట్లు తెలిపారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయం తెలియజేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

సోనియాగాంధీతో గద్దర్‌ చ్రితంలో గద్దర్‌ భార్య, కుమారుడు

కేసీఆర్‌ తన మాటలు వెనక్కి తీసుకోవాలి.. 
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని అమ్మా.. బొమ్మా అంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్‌ తన మాటలు వెనక్కు తీసుకోవాలని గద్దర్‌ సతీమణి విమల డిమాండ్‌ చేశారు. అసలు సోనియా తెలంగాణ ఇవ్వకపోతే ఇన్నాళ్ల పాటు కేసీఆర్‌ అధికారం చెలాయించేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ వ్యాఖ్యలు తమను బాధించాయన్నారు. సోనియా తన భర్తను కోల్పోయి ఎన్నో త్యాగాలు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం తన భర్త గద్దర్‌ వేల కిలోమీటర్లు పర్యటించారని గుర్తు చేసుకున్నారు. ఒక్క కేసీఆర్‌ దీక్ష చేస్తే తెలంగాణ రాలేదని, సోనియా ఇస్తే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నా రు. సోనియాతో సమావేశం సందర్భంగా రాజీవ్‌ గాంధీ హత్యోదంతం, గద్దర్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలను గుర్తు చేసుకుని విమల భావో ద్వేగానికి గురైనట్లు తెలిసింది. భేటీలో రాహుల్‌ కార్యాలయ కార్యదర్శి కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీగౌడ్‌ పాల్గొన్నారు. కాగా, శనివారం మన్మోహన్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా గద్దర్‌ కలుస్తారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement