
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సులభంగా విజయం సాధిస్తామని పాలకపక్ష భారతీయ జనతా పార్టీ భావిస్తున్న తరుణంలో ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో రెబెల్స్ బెడద పెరిగిపోయింది. ఏకంగా 24 మంది తిరుగుబాటుదారులు స్వతంత్య్రంగా లేదా ఇతర పార్టీల అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు. వారిలో ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొంత మంది పోటీ చేస్తున్నారు. వారందరిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ఇంతకుముందు ప్రీపోల్ సర్వేలో అంచనా వేసిన ‘లోక్‌నీతి–సీఎస్‌డీస్’ నిర్వహించిన సర్వేలో వెల్లడికాగా, అదే సంస్థ ఇప్పుడు తాజాగా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉంటుందని తేలడం కూడా బీజేపీకి ప్రతికూల పరిణామమే. పాటిదార్లు, ఓబీసీలు, బీసీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారడంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్ల శాతం అంచనా 29 శాతం నుంచి ఏకంగా 43 శాతానికి పెరిగింది. బీజేపీకి కూడా 43 శాతం ఓట్లు వస్తాయని తాజా సర్వేలో తేలింది.
బీజేపీ తిరుగుబాటు అభ్యర్థుల్లో ప్రముఖుడు అజయ్ చౌద్రీ. ఆయన సూరత్‌కు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి. దక్షిణ గుజరాత్‌లోని చోర్యాసి నియోజక వర్గం నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన్ని పార్టీ బహిష్కరించింది. ‘నేను రెబల్‌ను కాదు, బీహార్ నుంచి వలసవచ్చిన వాడిని. నాలాగా ఎందరో కొన్ని దశాబ్దాల క్రితమే హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. వారేమిటో నాకు తెలుసు. అలాగే నేనేమిటో, నా గురించి పార్టీ ఏమనుకుంటుందో అన్నీ నాకు తెలుసు. చోర్యాసీలోని హిందీ మాట్లాడే ప్రజలు తమను బీజేపీ విస్మరించినట్లు భావిస్తున్నారు. వారంతా తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆ గ్రూపులో నేను ఒక్కడిని మాత్రమే’ అని అజయ్ చౌద్రీ వ్యాఖ్యానించారు.
నరేంద్ర మోదీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2014లో దిగిపోయే వరకు రాష్ట్ర బీజేపీలో ఇలాంటి తిరుగుబాటు ఎన్నడూ లేదు. ‘ఇదివరకు ఆదేశాలు పార్టీ పైస్థాయి నుంచి వచ్చేవి. కిందిస్థాయి నాయకత్వం కాదనకుండా శిరసావహించేది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా వెళ్లిన తర్వాత రాష్ట్ర నాయకత్వంలో ఎవరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ నిర్ణయం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అర్థం కావడం లేదు’ అని సూరత్‌లోని కరంజ్ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ మరో రెబల్ భీమ్‌జీభాయ్ పటేల్ వ్యాఖ్యానించారు.
‘1981లో నేను పార్టీలో చేరాను. అప్పటికి నా వయస్సు 15 ఏళ్లే. అప్పటి నుంచి పార్టీకి విధేయుడైన సైనికుడిలాగానే పనిచేశాను. 2005 నుంచి 2015 మధ్య సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా పార్టీకి ప్రాథినిధ్యం వహించాను. కరంజ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని 2012లో పార్టీ అధిష్టానంకు చెప్పినప్పుడు. 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరి పేరును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేశారు. అందుకనే నా దారి నేను వెతుక్కోవాల్సి వచ్చింది’ అని ఆయన చెప్పారు.
చౌద్రీ, పటేల్ లాగానే బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుమాన్‌సింహ్ వాసియా బారుచ్ జిల్లా జంబూసర్ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నవ్‌సారి జిల్లాలోని జలాల్‌పూర్, చిఖ్లీ నియోజక వర్గాల్లోనైతే ఇద్దరేసి రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జలాల్‌పూర్‌లో ధనుంజయ్ భట్, అర్జున్‌పటేల్ బరిలో దిగగా, చిఖ్లీ నియోజక వర్గం నుంచి పార్టీ మాజీ ఎంపీ కంజీ పటేల్, ఆయన కుమారుడు సునీల్ కంజీ పటేల్ పోటీ చేస్తున్నారు. సౌరాష్ట్రలో రెబల్ అభ్యర్థులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నారు.
జంజోద్‌పూర్ నుంచి రమేశ్ దంగర్, ద్వారకా నుంచి అర్జన్ కంజారియా, బెకనూర్ నుంచి గోవర్దన్ సర్వావియా, గిర్ సోమ్‌నాథ్ నుంచి తులసీ గోహిల్, భావ్‌నగర్ నుంచి దిల్వార్ సింగ్ గోహిల్, జామ్‌నగర్ నుంచి బీజేపీ మాజీ నాయకుడు వల్లభ్ భాయ్ ధరాసియా పోటీ చేస్తున్నారు. ఉత్తర గుజరాత్ నుంచి కూడా బీజేపీ ప్రముఖులు తిరుగుబాటు అ«భ్యర్థులుగా రంగంలోకి దిగారు. మెహమ్మదాబాద్ నుంచి జుబాన్ సింగ్, సనంద్ నుంచి మాజీ ఎమ్మెల్యే కామా రాథోర్, రాధన్‌పూర్ నుంచి డాక్టర్ విష్ణుద్దన్ జూలా...ఇలా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం నుంచి బీజేపీకి రెబల్స్ బెడద తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment