సాక్షి, విజయవాడ : కేంద్ర పథకాలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్టిక్కర్ బాబు’ అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చేనెలలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేస్తుందని తెలిసి చంద్రబాబు ‘అన్నదాత సుఖీభవ’ అనే స్టిక్కర్ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులు ఏమయ్యాయో లెక్క చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. తాను అన్ని చేశానంటూ గొప్పులు చెప్పుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు.
రాజమండ్రిలో అమిత్ షా వాస్తవాలు చెప్తుంటే.. అవి టీడీపీ నాయకులకు మింగుడుపటడం లేదని జీవీఎల్ విమర్శించారు. అమరావతి పేరుతో అవినీతి కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ సినిమాలో కూడా అన్ని అవాస్తవాలే చూపించారని.. అందుకే ప్రజలు ఆ సినిమాను వ్యతిరేకించారని అన్నారు. కుమార్తెను చూడటం కోసం జగన్ లండన్‌కు వెళ్లారని, అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికల సందర్భంగా డబ్బు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపక్ష నేత విదేశాలకు వెళ్తున్నారంటూ ఆరోపించడం హస్యాస్పదంగా ఉందన్నారు. అంటే టీడీపీ నాయకులు విదేశీ పర్యటనలు చేసేది డబ్బు ఏర్పాటు చేసుకునేందుకేనా అంటూ ప్రశ్నించారు. టీడీపీ వ్యవహారశైలి నచ్చకే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment