
సాక్షి, గుంటూరు: అవినీతి, ఆర్బాటం, ప్రచారం తప్ప ఏపీకి సీఎం చంద్రబాబు చేసింది శూన్యమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు పసుపు ముసుగు వేశారని విమర్శించారు. అన్ని ముసుగులను తొలగిస్తామని చంద్రబాబు బండారం బయటపెడతామని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సోమవారం గుంటూరు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధి కాకుండా టీడీపీ ప్రభుత్వం చేసిన కనీసం మూడు పనులు చెప్పాలని సవాల్ విసిరారు. గృహనిర్మాణంలో అంతులేని అవినీతికి టీడీపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసిన ఎలక్ట్రానిక్ కంపెనీలను చినబాబు(నారా లోకేష్) గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలనుకుంటే, ప్రధానిని అడ్డుకుంటామని బాబు ప్రకటన చేయాలన్నారు . టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. టీడీపీ నేతలు చేసిన అవినీతి, అక్రమాలకు జైలు వెళ్లడానికి సిద్దంగా ఉండాలని జీవిఎల్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment