వారసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపైకి కొత్త నాయకులు రాబోతున్నారు. ఇప్పటికే సీనియర్లుగా ఉన్న పలువురు నేతల వారసులు రాజకీయ రంగంలోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వీరిని తెరపైకి తెచ్చేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యుల వారసులు దాదాపు 30 మంది వరకు ఈసారి ఎన్నికల్లో పోటీ అవకాశం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు అంచనా. వారంతా ఓవైపు టీఆర్‌ఎస్ అధిష్టానం మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూనే.. మరోవైపు తాము ఆశిస్తున్న నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ చురుకుగా వ్యవహరిస్తున్నారు.
కొందరు ఆశావహులైన వారసులు ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులను ఆకట్టుకునే యత్నంలో ఉండగా.. మరికొందరు ప్రజల్లో పేరు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా ఈ వారసుల రాజకీయ ప్రవేశానికి టీఆర్‌ఎస్ అధిష్టానం నుంచి కూడా సానుకూల స్పందన కనిపిస్తోందని అంటున్నారు. రాజకీయాల్లో రెండో తరాన్ని సుస్థిరం చేసుకునే దిశగా టీఆర్‌ఎస్ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. పార్టీలో ముఖ్యనేతల వారసుల రాజకీయరంగ ప్రవేశానికి మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం ఉన్నట్టు ముఖ్యులు పేర్కొంటున్నారు.
ఒక్కొక్కరిది ఒక్కో లక్ష్యం..
టీఆర్‌ఎస్ ముఖ్య నేతల వారసులు రాజకీయంగా వేర్వేరు లక్ష్యాలతో ఉన్నట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో తమ తల్లిదండ్రుల హవా నడుస్తున్నప్పుడే.. తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలన్న యోచనలో ఎక్కువమంది ఉన్నట్టు చెబుతున్నారు. తమవారి రాజకీయ ప్రభావం తగ్గితే.. తర్వాత అవకాశాలు కరువవుతాయని, పోటీ పెరుగుతుందని పలువురు వారసులు భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ వారసులను రంగంలోకి దింపాలనుకుంటున్న నేతలు.. తాము ఇప్పుడున్న స్థానాల్లో ఉంటూనే ప్రోత్సహించడం, మరో స్థానానికి మారి వారసులకు అవకాశమివ్వడం, పరోక్ష పదవుల ద్వారా రాజకీయాల్లోకి తీసుకురావడం వంటి వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశాలను పొందాలనే వ్యూహంతోనే ఎక్కువ మంది నాయకులు ఉన్నారు.
30 మందికిపైగానే..
టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యుల వారసులు దాదాపు 30 మందికిపైగానే రాజకీయ రంగం ప్రవేశాన్ని కోరుకుంటున్నారు. వీరిలో చాలామంది వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వీరందరికీ అవకాశం రాకపోయినా.. ఏదో ఒక రూపంలో తమ వారసులను రాజకీయాల్లో కొనసాగించేలా నేతలు ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం. ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలు.. ఇలా ఏ అవకాశమున్నా అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎవరెవరు.. ఎక్కడెక్కడ..?
పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నవారితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ వారసులను రాజకీయ రంగ ప్రవేశం చేయించడం కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తుంటే.. మరికొందరు చాపకింద నీరులా లోలోపల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు నాయకుల వారసులు దూకుడుగా వ్యవహరిస్తూ.. తమ రాజకీయ ప్రవేశం అనివార్యమనే సంకేతాలు ఇస్తున్నారు.
– శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ భూపాలపల్లి నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
– ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్య స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పోటీకి అవకాశం కోరుకుంటున్నారు.
– ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కుమారుడు ఆజం అలీ హైదరాబాద్‌లో అవకాశమున్న ఏదైనా ఓ నియోజకవర్గంలో పోటీచేయాలనే యోచనతో ఉన్నారు.
– ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున కొంతకాలంగా రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆమెను పోటీ చేయించే యోచన ఉన్నట్టు తెలుస్తోంది.
– మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
– మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తనయుడు యుగంధర్‌రావు రాజకీయరంగ ప్రవేశాన్ని కోరుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ (ప్రస్తుతం సూర్యాపేట జిల్లా) జిల్లాలోని కోదాడ నుంచి కానీ, చుట్టుపక్కల ఏదైనా నియోజకవర్గం నుంచిగానీ పోటీ చేసే యోచనలో ఉన్నారు.
– ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళిల కుమార్తె సుస్మిత పటేల్ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు.
– మంత్రి జోగు రామన్న కుమారుడు జితేందర్ రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
– ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కుమారుడు అరుణ్ నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
– మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్‌రావు రాజకీయ ప్రవేశం కోసం ఆసక్తిగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
– మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి షాద్‌నగర్ లేదా కొడంగల్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు.
– ఎంపీ కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు విప్లవ్‌కుమార్‌లలో ఒకరు జూబ్లీహిల్స్ లేదా ఖైరతాబాద్ స్థానంలో పోటీకి దిగాలని ఆశిస్తున్నారు.
– మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ అసెంబ్లీకిగానీ, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికిగానీ పోటీ చేయాలన్న దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
– మంత్రి టి.పద్మారావు తనయుడు రామేశ్వర్‌యాదవ్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.
– హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ముషీరాబాద్ నుంచి అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు.
– మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి భార్య సునీతా మహేందర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా, తమ్ముడు నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా మహేందర్‌రెడ్డి వారసుడిగా అవినాష్‌రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశిస్తున్నారు.
– ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు కుమారుడు క్రాంతి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారులు భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పి.హరీశ్వర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, సాయన్న తదితరుల వారసులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment