అనిల్ సింగ్, బీఎస్పీ ఎమ్మెల్యే
సాక్షి, న్యూఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి ఆ పార్టీ ఎమ్మెల్యే అనిల్ సింగ్ ఝలక్ ఇచ్చారు. శుక్రవారం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటు వేసినట్లు నేరుగా చెప్పి షాక్ ఇచ్చారు. మిగితా వారు ఎవరికి ఓటు వేశారో తనకు తెలియదన్నారు. దీంతో బీఎస్పీ రాజ్యసభ సీటుకు గండం ఏర్పడినట్లయింది. అత్యంత ఉత్కంఠ నడుమ శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 25 సీట్లకుగాను ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 10, పశ్చిమ బెంగాల్‌లో 5, కర్ణాటకలో 3, తెలంగాణలో 3, జార్ఖండ్‌లో 2, చత్తీస్‌గఢ్‌లో 1, కేరళలో 1 సీటుకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి.
అయితే, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం ఉత్కంఠ తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌లో ఒక రాజ్యసభ సీటు దక్కించుకోవాలంటే 37మంది మద్దతివ్వాలి. దీంతో మొత్తం 10 స్థానాల్లో 300 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 8 సీట్లు గెలుచుకుంటామని ధీమాగా ఉండటంతోపాటు తొమ్మిదో సీటును కూడా కొల్లగొట్టాలని చూస్తోంది. అలాగే, అక్కడ ఎస్పీకి 1, బీఎస్పీకి 1 సీటు ఉన్నాయి. ఎస్పీ సీటుకు ఎలాంటి డోకా లేకున్నా బీఎస్పీకి పూర్తి స్థాయి ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఆ సీటును బీజేపీ దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే, 19మంది ఎమ్మెల్యేలు బీఎస్పీకి ఉండటం, ఎస్పీ నుంచి 10 మంది, కాంగ్రెస్ నుంచి 7గురు, అజిత్ సింగ్ పార్టీ నుంచి ఒకరు(మొత్తం 37 మంది) మాయావతికి లభించడంతో బీఎస్పీ సీటుకు కూడా ఢోకా లేదనుకున్నారు.
అయితే, తాజాగా తాను ఓటును బీజేపీకి వేశానంటూ అనిల్ సింగ్ ఝలక్ ఇవ్వడంతో బీఎస్పీ ఇప్పుడు కొంత టెన్షన్‌లో పడింది. అనిల్ సింగ్ ఓటు బీజేపీకి వెళితే మాయావతి పార్టీకి 36 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లవుతుంది. దాంతో ఆమె పార్టీకి రాజ్యసభ సీటు దూరమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ బీజేపీ వాళ్లలో ఎవరైనా క్రాస్ ఓటింగ్‌కు దిగి బీఎస్పీకి ఓటు వేస్తే సీటుకు ఏ ప్రమాదం ఉండబోదు. అయితే, ఈ ఎన్నికల్లో విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. బీజేపీ తొమ్మిదో సీటును కూడా గెలుచుకుంటుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేయగా.. తమ పార్టీలో ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరగడం లేదని, బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ తమకు అనుకూలంగా చేస్తారని సమాజ్‌వాది పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment