‘పశ్చిమ’లో గెలిస్తే అధికారం ఆ పార్టీదే.. | If Any Party Wins in West Godavari District, That Party Will Come To Power In The State | Sakshi
Sakshi News home page

ఈ జిల్లాలో

Published Sat, Apr 6 2019 9:55 AM | Last Updated on Sat, Apr 6 2019 4:11 PM

If Any Party Wins in West Godavari District, That Party Will Come To Power In The State - Sakshi

సాక్షి,  పశ్చిమ గోదావరి : చైతన్యవంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయంగా ఎందరో దురంధరులు చక్రం తిప్పారు. అల్లూరి సుభాష్‌చంద్రబోస్, భూపతిరాజు విజయకుమార్‌రాజు, గండిపేట మేధావి మెంటే పద్మనాభం, మాగంటి రవీంద్రనాథ్‌చౌదరి, చేగొండి హరిరామజోగయ్య, కమ్యూనిస్టు నాయకుడు వంకా సత్యనారాయణ వంటి ఎందరో ఉద్దండ రాజకీయ నాయకులను తయారు చేసింది ఈ ప్రాంతం.

ఈ జిల్లాలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ప్రతి ఎన్నికల్లోనూ రుజువవుతూ వస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో టీడీపీ, దాని మిత్రపక్షమైన బీజేపీని గెలుపు గుర్రం ఎక్కించిన ఈ జిల్లా ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి ఆధిక్యత ఇచ్చేందుకు సిద్ధమైంది. అన్నివర్గాలు మార్పు కోరుతున్నాయి. ఎవరిని కదిపినా.. ‘ఈసారి జగన్‌కు అవకాశం ఇద్దాం’ అంటున్నారు. 

నరసాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఏలూరు పార్లమెంటరీ స్థానం పరిధిలో పశ్చిమ గోదావరిలో 5 స్థానాలు, (కృష్ణా జిల్లా కైకలూరు, నూజివీడు రెండు అసెంబ్లీ స్థానాలు), రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం పరిధిలో కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం స్థానాలతో కలిపి మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎస్సార్‌ సీపీ, టీడీపీ మధ్యనే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాను స్వీప్‌చేసి అధికారం చేపట్టిన టీడీపీ ఎదురీదుతోంది.

ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల అక్రమాలను ప్రజలు ఈసడించుకుంటున్నారు. 2014 ఎన్నికల నాటి ఫలితాలు తలకిందులయ్యే పరిస్థితి టీడీపీ కంటిపై కనుకు లేకుండా చేస్తోంది. ఇసుక నుంచి మట్టి వరకూ అన్నింటా ప్రజాధనాన్ని దోపిడీ చేసి, భూకబ్జాలు, దళితులు, ప్రభుత్వ అధికారులపై దాడులకు తెగబడ్డ దురాగతాలు, పోలవరం, పట్టిసీమ పనుల్లో అవినీతి, బాబు ఇచ్చిన ఎన్నికల హామీలను గాలిలో కలిపేయడం వంటి వాటికి విసుగెత్తిపోయిన జిల్లా వాసులు ఈ సారి స్పష్టంగా మార్పును çకోరుకుంటున్నారు. 

తుందుర్రు మెగా ఆక్వా పార్క్, గరగపర్రు దళితులపై దాడి, మహిళా తహసీల్దార్‌ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం.. ఇలా టీడీపీ అధికార దుర్వినియోగం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బాధితులకు వైఎస్‌ జగన్‌ అండగా నిలబడి మనోధైర్యాన్ని కల్పించడంతో ఇప్పుడా వర్గాలన్నీ వైఎస్సార్‌ సీపీ వైపు మొగ్గుచూపుతున్నాయి.

టీడీపీకి ఓటు బ్యాంక్‌గా భావించే బీసీలలో బలమైన శెట్టిబలిజ, గౌడ సామాజిక వర్గాలు వైఎస్సార్‌ సీపీ పట్ల సానుకూలంగా ఉన్నాయి. ఏలూరు బీసీ గర్జనలో జగన్‌ ప్రకటించిన బీసీ ప్యాకేజీపై నమ్మకంతో ఆ వర్గాలు వైఎస్సార్‌ సీపీ వైపు నిలుస్తుండటంతో తన ఓటు బ్యాంక్‌ నిట్టనిలువునా చీలిపోతోందని టీడీపీ ఆందో ళన చెందుతోంది. జనసేన భారీ అంచనాలు పెట్టుకున్నా.. నామమాత్రపు పోటీకే పరిమితమవుతోంది.

పవన్‌ భీమవరంలోనే ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. పలు నియోజకవర్గాల్లో జనసేన చీల్చే ఓట్లతో టీడీపీ ఓటు బ్యాంక్‌కు భారీగా గండిపడనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా, కాంగ్రెస్, బీజేపీ ఉనికి కోసం ప్రాకులాడుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement