నరేంద్ర మోదీ, బీఎస్ యడ్యూరప్ప (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తాజా కర్ణాటక ఎన్నికలు హెచ్చరికగా మారనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప విజయం సాధిస్తే అది ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలోకి వెళ్తుందని.. ఒకవేళ మరోసారి ఓడితే మాత్రం అది యెడ్డీ ఖాతాలోకి పార్టీ అధిష్టానం నెట్టివేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా ఉండబోతుదని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
అసలే 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే కర్ణాటక ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు చాలా కీలకం. దక్షిణాదిలో ఇప్పటివరకూ బీజేపీ సొంతంగా అధికారంలోకొచ్చిన ఏకైక రాష్ట్రం కర్ణాటక కావడం గమనార్హం. అయితే కర్ణాటకలో ఎన్నికల షెడ్యూలు విడుదల కావడం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి నెల రోజుల ముందు కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం మరోసారి సిద్ధరామయ్యకు సీఎం కూర్చీ అప్పగించాలని తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రధాని మోదీ మాత్రం ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. చైనా నుంచి తిరిగొచ్చినా వెంటనే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొనడం లేదు. మే 3, 5, 7, 8 తేదీల్లో బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొని.. బీజేపీ అభ్యర్థి యుడ్యూరప్ప తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. కాగా, రాహుల్ మే 10వ తేదీ వరకు తన ప్రచారం కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు యెడ్డీ తనయుడు విజయేంద్రకు టికెట్ ఇచ్చేది లేదని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. దాంతోపాటుగా యెడ్డీ తనయుడిని బుజ్జగించేందుకు బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయేంద్రను నియమిస్తున్నట్టు ప్రకటించింది. అధిష్టానం నిర్ణయంపై యెడ్డీ అసంతృప్తిగా ఉన్నప్పటికీ బహిరంగంగా వెల్లడించలేకపోతున్నారని కర్ణాటక బీజేపీ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment