
సాక్షి, అమరావతి: రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఆ వివరాలు సరైన సమయంలో బహిర్గతం చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిలో భూ అక్రమాలపై మా వద్ద పూర్తి సమాచారం ఉందని, అవసరం వచ్చినప్పుడు ఆ చిట్టా విప్పుతామన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ రాజధానిలో నాకు భూములే లేవంటున్నారని, ఆయన సవాల్ విసిరితే మొత్తం బయటపెడతాం అని సుజనా చౌదరిని ఉద్దేశించి అన్నారు.
రాజధాని భూముల విషయమై చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని పవన్ కల్యాణ్ చాలా చెప్పారని, కానీ ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కూడా గతంలో రాజధానిపై ఆరోపణలు చేశారని, ప్రస్తుతం ఆ పార్టీ నేతలు ఏమి చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందింది కాదని అన్నారు. రాష్ట్రంలో నాలుగు రాజధానుల విషయంపై టీజీ వెంకటేష్ మాట్లాడిన విషయాన్ని మంత్రి దృష్టికి మీడియా తీసుకెళ్ళగా...ఆయన్నే అడగండి అని అన్నారు.
అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తాం...
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అమరావతి రైతులకు త్వరలోనే కౌలు చెల్లిస్తాం. కౌలు డబ్బులు ప్రతి రైతుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. కౌలు అందలేదనే అమరావతి రైతులు ధర్నా చేస్తున్నారని, ఈ విషయమై చర్చించేందుకు రైతులు తన వద్దకు వచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment