సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండు ఓట్లు కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్‌కు రెండు ఓట్లున్నా ఒకదానిని తొలగించి ఉంటారని, అది రికార్డులో నమోదై ఉండదని, రెండు ఓట్లు ఉన్నా కేసీఆర్ వేసింది ఒక ఓటేగా అంటూ వ్యాఖ్యానించింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సందర్భంగా పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందువల్ల వీవీ ప్యాట్ స్లిప్పులను సిబ్బంది ద్వారా లెక్కించేటట్లు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తావనకు వచ్చినప్పుడు హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ ప్రతాప్‌రెడ్డి తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సాధారణ పద్ధతిలో ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడే చేపడతామని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ ఎన్నికల్లో తనను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రతి దశలోనూ ప్రభావితం చేశారని, ఇందులో భాగంగా సిబ్బంది చేత ఈవీఎంలను మార్పించారని తెలిపారు. దీనిపై అభ్యంతరం చెప్పినందుకు పోలీసుల చేత తనపై, తన కుటుంబసభ్యులపై, పోలింగ్ ఏజెంట్లపై భౌతికదాడులు చేయించారని వివరించారు. ఈవీఎంలు తారుమారైనందున వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం సమర్పించానని, అయితే అన్ని స్లిప్పులను లెక్కించడం సాధ్యంకాదని, ఏదో ఒక బాక్స్‌లో ఉన్న స్లిప్పులను లెక్కిస్తామని వారు చెప్పారన్నారు.
మొత్తం 306 బూత్‌లుంటే, ప్రతి బూత్‌లో 20 ఓట్లను తారుమారు చేశారని, దీంతో 7 వేల ఓట్లు ప్రభావితమవుతాయని, గెలుపోటములను నిర్ణయించేందుకు ఈ సంఖ్య సరిపోతుందన్నారు. రెండు లక్షల కంటే తక్కువ ఉన్న వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.
కేసీఆర్‌కు రెండు ఓట్లున్నా ఒకటి తొలగించి ఉంటారు..
Published Tue, Dec 11 2018 1:30 AM | Last Updated on Tue, Dec 11 2018 1:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment