
సాక్షి, హైదరాబాద్ : పీసీసీ పదవికి సీనియర్ నేత వి. హనుమంతరావు అర్హుడేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. హైకమాండ్ బీసీలకు పీసీపీ ఇవ్వాలనుకుంటే వీహెచ్ సమర్థుడైన నాయకుడని జగ్గారెడ్డి చెప్పారు. బీసీలలో వీహెచ్ స్టార్ అని ప్రశంసించారు. వీహెచ్‌కి పీసీపీ ఇస్తే అన్ని విధాలా ఆయనకు సహకరిస్తానని తెలిపారు. పీపీసీ పదవిని ఎస్సీలకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తే దామోదర రాజనర్సింహకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెడ్డిలలో పీసీసీ పదవి తనతో పాటు మిగతావారిలో ఎవరికిచ్చినా సమర్థవంతంగా పనిచేస్తారని జగ్గారెడ్డి అన్నారు.
కాగా పీసీపీ పదవి తనకు ఇవ్వాలని జగ్గారెడ్డి అధిష్టానాన్ని కోరడంపై వీహెచ్ మండిపడ్డ విషయం తెలిసెందే. ఎప్పుడూ ఒకే సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న వారికే పీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను పార్టీలో సీనియర్ నేతనని, తనకే పీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.