సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, మున్సిపల్ ఎన్నికలలో 50 శాతం చైర్మన్ పదవులను కైవసం చేసుకుంటామని దీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిని మార్చడం అనవసరమన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని కుంతియాకు చెప్పినట్టు వెల్లడించారు.
పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారని, వీళ్లంతా సమర్థులేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లో లాగా కాంగ్రెస్‌లో సింగిల్ హీరో ఉండరని, బలమైన నాయకులు చాలా మంది ఉన్నారని అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వీడినా పార్టీ బలంగానే ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా సహకరిస్తానని, అవకాశం ఉంటే తనకు ఇవ్వాలని కుంతియాను కోరినట్టు తెలిపారు. ఇక నుంచి గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టె నాయకులు ఎవరైనా పీసీసీ అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలని పార్టీ నిర్ణయించినట్టు వెల్లడించారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అప్పుల పాలైన పార్టీని గాడిలో పెడతానని, కార్యకర్తలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఆశించనని జగ్గారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment