
ప్రశ్న: రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఎలా కలిగింది.?
జవాబు : నేను వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నాను. చిన్నప్పటినుంచి లీడర్‌షిప్ అంటే నాకు చాలా ఇష్టం. చదువుకునేటప్పుడు స్నేహితులకు ఏ అవసరమొచ్చినా ముందుండి చూసుకునేవాణ్ణి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రజలకు మరింత సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను.
ప్రశ్న: సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా..?
జవాబు: మనకు ఉన్నంతలో తోటి వాళ్లకు సహాయ పడాలని, పదిమందికి మంచి చేసినప్పుడే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడని మా పెద్దలు చెప్పేవారు.వారి మాటలు నా మనసులో అలాగే నిలిచిపోయాయి.ఆపద వచ్చిందని ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించి సాయం చేస్తా. స్వయంగా వైద్యసేవలు అందిస్తాను.పేదవారింట జరిగే వివాహాలకు ఆర్థిక సాయంతో పాటు చేయూతనందిస్తున్నాను.ఇవన్నీ ఎవరికీ తెలియకుండా జరిగింది. సందర్భం రావడంతో తప్పక చెబుతున్నా.
ప్రశ్న : జమ్మలమడుగు నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు..?
జవాబు: జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రధాన సమస్య నిరుద్యోగం. చాలా మంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస నిర్వాసితులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైతులకు గిట్టు బాటు ధర లభించక అనే మార్లు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాల్టీల్లో పన్నుల మోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆర్టీపీపీలో వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు క్రమబద్ధీకరణ కాక, సమాన పనికి సమాన వేతనం రాక ఇబ్బందులు పడుతున్నారు. నాపరాయి పరిశ్రమలపై పన్నుల మోతతో చాలా పరిశ్రమలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఉంది. చేనేతలకు సబ్సిడీ రుణాలు, గుర్తింపు కార్డులు లేక పోవడం, మగ్గాల ఇళ్లకు కమర్షియల్ పన్నులు ఇలా ప్రజలు కష్టాలు పడుతున్నారు.
ప్రశ్న: వీటిని ఎలా పరిష్కరిస్తారు..?
జవాబు : రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ అ«ధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికులను, అవుట్ సోర్సింగ్‌లను క్రమబద్ధీకరణ చేస్తామని హమీ ఇచ్చారు.పన్నుల తగ్గింపు కోసం ప్రయత్నం చేస్తాను. పెన్నానదికి ఏటా నీరు అందించే ఏర్పాటు చేస్తాను. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రజలకు సేవ చేయడానికి.. వారి సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం అందుబాటులో ఉంటాను.
ప్రశ్న : గెలుపునకు దోహదపడే అంశాలేవి..?
జవాబు: టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ భూకబ్జాలు, ఇసుక దోపిడీ, జన్మభూమి కమిటీ సభ్యుల దౌర్జన్యాలు, నీరు చెట్టు పనుల్లో అవినీతి , సామాన్యులకు చేరువ కాని సంక్షేమ పథకాలు తదితరాలను అస్త్రాలుగా ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్తాం.పేద ప్రజల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇంటింటీకీ తెలియజేస్తాం. వైఎస్ జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న పాలన తీసుకువస్తారని నమ్మకాన్ని కలగజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగనన్న సీఎం కావడం చారిత్రక అవసరం.
ప్రశ్న: ఇద్దరు ఫ్యాక్షనిస్టులతో పోటీ పడుతున్నారు..దీనిపై మీ స్పందన..?
జవాబు: జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒకప్పుడు మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి ఇద్దరు కత్తులు దూసుకున్నారు. వారి అనుచరులు వీరిపై నమ్మకంతో జైలు పాలయ్యారు.కుటుంబాలు ఛిద్రం అయ్యాయి. ఇప్పుడు వారిద్దరు కలిíసి తిరుగుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వారిద్దరి వల్ల నష్టపోయిన కుటుంబాల వారు మార్పు కోరుతున్నారు. అందుకే వైఎస్సార్‌సీపీపై ఆదరణ చూపుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని, ఇద్దరు ఫ్యాక్షనిష్టులను చిత్తుగా ఓడిస్తారు. ఇది సత్యం.
Comments
Please login to add a commentAdd a comment