
బిహార్ సీఎం నితీష్ కుమార్(పాత చిత్రం)
పట్నా: తమ రాష్ట్రానికి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ప్రకటించాలని జనతాదళ్(యునైటెడ్) పార్టీ సోమవారం కోరింది. నరేంద్ర మోదీ మంగళవారం బిహార్‌లోని మోతిహరిలో పర్యటించనున్నారు. చంపారన్ సత్యాగ్రహం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు మోదీ అక్కడకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని జేడీయూ ప్రధాన కార్యదర్శి షాయం రజాక్ డిమాండ్ చేశారు.
ఈ విషయం గురించి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గత నెలలోనే లేవనెత్తారు. 2005లోనే మొదటిసారి బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని నితీష్ కోరారు. అప్పటి నుంచి మిన్నకుండిపోయిన నితీష్ ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని వైఎస్సార్సీపీ, టీడీపీ ఢిల్లీలో పోరాటం చేస్తుండటంతో మళ్లీ ఈ అంశం తెరమీదకు వచ్చింది. నితీష్ కుమార్ గనక గట్టి నాయకుడైతే బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలని మోదీని డిమాండ్ చేయాలని గత వారం బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.