
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియాలో విద్యార్థి మురళి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఇది ప్రభుత్వ హత్య అని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఏనాడూ లేనంత నిర్బం ధం కొనసాగుతోందని, ప్రజల కనీస హక్కులనూ పోలీసులు హరిస్తున్నారని, ఓయూను నిర్బంధకాండకు ప్రయోగ శాలగా మార్చారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరుతో ఆందోళన చెందుతున్న యువత ఆత్మహత్యల బాట పడుతోందని, దీనిలో భాగంగానే మురళి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోలాగే తెలంగాణలోనూ పాలకులు నిరుద్యోగుల ఉసురు తీస్తున్నారన్నారు.
విచారణ జరపాలి: టి–మాస్
ఎంత చదివినా ఉద్యోగం రాదన్న మనస్తాపంతో ఉస్మానియాలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై విచారణ జరపాలని తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్య వేదిక (టి–మాస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు వేదిక కన్వీనర్ జాన్‌వెస్లీ, స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు సోమవారం ఒక ప్రకటన చేశారు.