సోనియాకు పుష్పగుచ్ఛమిస్తున్న హేమంత్
న్యూఢిల్లీ: జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ నెల 29వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. అనంతరం ఆయన రాహుల్ గాంధీతోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోనూ సమావేశమై, వారినీ ఆహ్వానించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఆర్‌పీఎన్ సింగ్ కూడా ఉన్నారు. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ అని సోనియాతో సమావేశానికి ముందు హేమంత్ సోరెన్ మీడియాతో అన్నారు.
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానన్నారు. తమ సంకీర్ణ ప్రభుత్వం సుస్థిరంగా ఐదేళ్లూ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్‌ను ఆహ్వానించారని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బుధవారం తెలిపింది. మంగళవారం హేమంత్, ఇతర కూటమి నేతలతో గవర్నర్‌తో సమావేశమై తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖ అందజేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment