
మాట్లాడుతున్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: బీజేపీ, సంఘ్‌పరివార్ శక్తులకు అడ్డుకట్ట వేయాలని, లేకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని గుజరాత్ ఎమ్మెల్యే, సామాజిక ఉద్యమకారుడు జిగ్నేష్ మేవాని పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో మహాజన పాదయాత్ర ముగింపు వార్షికోత్సవం సందర్భంగా ‘‘నేటి రాజకీయాలు–వామపక్ష సామాజిక శక్తుల కర్తవ్యం’’ అనే అంశంపై సదస్సు సోమవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిగ్నేష్ మేవాని మాట్లాడుతూ దేశంలోని అంబేడ్కర్ వాదులు, వామపక్షాల కలయిక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులను నివారించటంలో సఫలీకృతం అవుతాయని అన్నారు. సిద్దాంతపరమైన విభేదాలు వస్తే చర్చించుకొని ముందుకు పోవాలని తెలిపారు.
2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించకుంటే ఎంతో కొంత ఉన్న ప్రజాస్వామ్యం కనుమరుగవుతుందని, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమం కోసం పని చేయాలని సూచించారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని చెప్పారు. ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సంక్షోభంతో పాటు కృత్రిమ రాజకీయ సంక్షోభం ఏర్పడిందన్నారు. తిరిగి వారే అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఎవరి జనాభాకు అనుగుణంగా వారికి సీట్లు ఇవ్వటమే ఫ్రంట్ లక్షమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మనువాద పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ మాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సామాజిక వేత్త ఉ.సాంబశివరావు, జాన్‌వెస్లీ, ఎం.వి.రమణ, ఎస్.రమ, పి.ఆశయ్య, ఎండి.అబ్బాస్, ఎం.శోభన్ నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment