
సాక్షి, విజయవాడ : రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మాటలు వింటే నవ్వొస్తుంది.. బడ్జెట్‌పై బహిరంగ చర్చకు యనమల సిద్ధమా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ సవాల్ చేశారు. బడ్జెట్ చూసి యనమలకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు పెద్దపీట వేసిందన్నారు జోగి రమేష్. నవరత్నాలను 80 శాతం ప్రజలకు చేర్చేలా బడ్జెట్ ఉంటే.. యనమల ఎన్నికల హామీలను నెరవేర్చలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యనమల కళ్లు పోయాయా అని ప్రశ్నించారు. జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే.. చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించాడని ఆయన విమర్శించారు. రైతు భరోసా ద్వారా రైతులకు రూ. 8750 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. పంటల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3 వేల కోట్లు కేటాయించామన్నారు.
రైతులకు వైఎస్సార్ బీమా, ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు జోగి రమేష్. తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. పథకాలకు రాజశేఖర్ రెడ్డి పేరు పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అమ్మ ఒడి ద్వారా కొన్ని లక్షల మంది తల్లుల కలలను నేరవేరుస్తాం అని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. అతి త్వరలోనే 30 కమిటీలు వేసి.. తెలుగుదేశం నేతలు తిన్న సొమ్ము కక్కిస్తామని జోగి రమేష్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment