మాట్లాడుతున్నఅపధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హన్మకొండ (వరంగల్): ఈ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది లేదని, తాను కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేరేది లేదని అపధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. బురదజల్లే పుకార్లు, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను నమ్మొద్దని, తాను వ్యక్తిత్వమున్న, నిజాయితీ కలిగిన వ్యక్తినని అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఆదివారం ఆయన విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సందర్భంలో మాత్రం ఒక్కసారి బీజేపీకి ఓటు వేశానన్నారు. అంతకు ముందు టీడీపీకి, టీఆర్‌ఎస్‌లో చేరాక టీఆర్‌ఎస్‌కు ఓటు వేశానన్నారు. తనకు ఓటు హక్కు లభించిన తొలి నాళ్లలో అప్పటి తెలంగాణ ప్రజాసమితికి ఓటు వేశానని వివరించారు. జీవితంలో ఎప్పుడూ కాంగ్రెస్‌కు ఓటు వేయనని చెప్పారు.
ఎంపీగా ఉన్న తనను సీఎం కేసీఆర్ తనను ఉప ముఖ్యమంత్రిని చేశారని, కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌లో పని చేస్తానన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో అసమ్మతి సద్దుమణిగేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోతే కడయం శ్రీహరి కారణంగానే ఓడిపోయారనే ప్రచారం జరిగే అవకాశముంది కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ నిందలు అనేవి సహజమన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌కు అభ్యర్థే దిక్కు లేడన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను అధిష్టానం తనకు అప్పగించిందన్నారు. అసమ్మతి నాయకులతో మాట్లాడి సయోధ్య కుదిరించి, పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. 12 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం చేయడంపై మాట్లాడుతూ రాజేశ్వర్‌రెడ్డిది స్టేషన్‌ఘన్‌పూర్ సొంత నియోజకవర్గమని, పార్టీ నాయకుడిగా ప్రచారం చేయొచ్చన్నారు.
దీనికి గురించి గొప్పగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ వారసులుగా ఎవరు వస్తారని అనే అంశంపై స్పందిస్తూ ప్రజలు ఆశీర్వదిస్తే వస్తారన్నారు. తన కూతురు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో నిరుత్సాహంగా ఉన్న అసమ్మతి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు రావాలని పార్టీ ఆదేశించిందని, ఈ మేరకు 1వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు చెప్పారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ తమను పిలిచారని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకరిద్దరు స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశముందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పార్టీని వీడరన్నారు. ప్రస్తుతం 5 నుంచి 10 నియోజకవర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోందని, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అంతా సద్దుమణుగుతుందన్నారు. వరంగల్ తూర్పులో గెలువలేకనే కొండా సురేఖ పరకాలకు పలాయనం చిత్తగించారని కడియం శ్రీహరి విమర్శించారు. వ్యతిరేకత ఉండడంతోనే పరకాలకు వెళ్లారని, దమ్ముంటే సురేఖ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment