భూపాలపల్లి: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పోగొట్టింది ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలేనని.. మరోమారు ఏఐటీయూసీని గెలిపిస్తే పెరట్లో పాము మాదిరిగా అది కార్మికులను కాటు వేస్తుందని నిజామాబాద్ ఎంపీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భూపాలపల్లిలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే టీబీజీకేఎస్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించేందుకు సర్క్యులర్ తీసుకొస్తే ఏఐటీయూసీ కోర్టులో కేసు వేసి అడ్డుకుందన్నారు. రానున్న రోజుల్లో 50 వ్యాధులను జత చేసి వారసత్వ ఉద్యోగాలకు బదులుగా కారుణ్య నియామకాలు చేపడుతామని హామీ ఇచ్చారు. అనుమానం ముందు పుట్టి ఎర్రచొక్కా తర్వాత పుట్టిందని, కార్మికుల సంక్షేమం కోసం చేపట్టే ప్రతి పనికీ ఎర్రచొక్కా నాయకులు ఏదో అనుమానం చెబుతూ అడ్డు పడుతున్నారని, ఈ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు.
తమ యూనియన్‌ను గెలిపిస్తే నేమ్ కరెక్షన్ పేరిట మారు పేర్లతో పనిచేస్తున్న కార్మికులందరి పేర్లు సరిచేస్తామన్నారు. సొంతింటి కలను నెరవేర్చేందుకు వడ్డీ లేని రుణం రూ. 6 లక్షలు అందజేస్తామన్నారు. 190 నుంచి 240 మస్టర్ల వరకు ఉన్న బదిలీ ఫిల్లర్లను పర్మనెంట్ చేస్తామన్నారు. జేఎంఈటీ కార్మికుల ప్రమోషన్ల పరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తామన్నారు. అంబేడ్కర్ జయంతిని హాలిడేగా ప్రకటిస్తామన్నారు.
గులాబీ జెండా ఎగరడం ఖాయం
గోదావరిఖని (రామగుండం): సింగరేణిలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం తథ్యమని, సింగరేణిలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని యూనియన్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత ధీమా వ్యక్తంచేశారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆర్జీ–3 పరిధిలోని ఓసీపీ–1లో జరిగిన గేట్ మీటింగ్‌లో, ఆ తర్వాత ఆర్జీ–1 డివిజన్ పరిధిలోని గోదావరిఖనిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.
టీఆర్‌ఎస్ పాలనలోనే 16 శాతంగా ఉన్న లాభాల వాటాను 25 శాతానికి పెంచామని, గతంలో నెలకు 25 మంది వారసులకు ఉద్యోగాలిచ్చే పరిస్థితి ఉంటే దానిని పక్కకు పెట్టి ఒకేసారి 3,100 మందికి ఉద్యోగాలివ్వడం జరిగిందన్నారు. సింగరేణి సంస్థ మనుగడ, కార్మిక సంక్షేమం కోసం టీబీజీకేఎస్ గుర్తు బాణంపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కవిత కార్మికులను కోరారు.
మరోవైపు సింగరేణిలో కొత్త గనులు, ఉద్యోగాలతో సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఆర్‌కే గార్డెన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవిస్తే 2003లో టీబీజీకేఎస్ యూనియన్ ఏర్పడిందన్నారు.