ఎస్‌సీఎల్‌యూ భవితవ్యమేమిటి ?
ఎస్‌సీఎల్‌యూ భవితవ్యమేమిటి ?
Published Sat, Aug 20 2016 2:52 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
టీబీజీకేఎస్‌లో విలీనమా..కలిసి పనిచేయడమా..!
అయోమయంలో ఐఎన్‌టీయూసీ శ్రేణులు
గోదావరిఖని(కరీంనగర్) : ఐఎన్‌టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్(ఎస్‌సీఎల్‌యూ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా నియూమకం కావడంతో ఎస్‌సీఎల్‌యూ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కొంత కాలం క్రితం గోదావరిఖనిలో జరిగిన యూనియన్ సమావేశంలో టీబీజీకేఎస్‌తో కలిసి పనిచేయడానికి వెంకట్రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇటీవల శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తనతో కలిసి వచ్చే నాయకులతో సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆయన వెంట వెళ్లే నాయకులెందరనేది సంశయంగా మారింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెంకట్రావు వ్యవహరిస్తున్నందున ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎస్‌సీఎల్‌యూను అందులో విలీనం చేయూలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ భవిష్యత్‌లో టీబీజీకేఎస్ నుంచి బయటకు వచ్చినా.. తిరిగి ఎస్‌సీఎల్‌యూ ద్వారా సింగరేణి లో కార్యకలాపాలు నిర్వహించేందుకు కలిసి పనిచేయా లా? అనే మరో ఆలోచన సైతం చేస్తున్నట్లు సమాచారం.
బలోపేతం కానున్న ఎస్‌సీఎస్‌డబ్ల్యూయూ
సింగరేణిలో నిన్నటి వరకు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీకి సింగరేణిలో రెండు యూనియన్లు పనిచేశాయి. వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్‌సీఎల్‌యూ, జనక్‌ప్రసాద్ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(ఎస్‌సీఎస్‌డబ్ల్యూయూ) కార్యకలాపాలు కొనసాగించాయి. అయితే వెంకట్రావు టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెళ్లడంతో ఎస్‌సీఎల్‌యూలో కొనసాగే క్యాడర్, కాంగ్రెస్ అభిమానులు సహజంగా ఎస్‌సీఎస్‌డబ్ల్యూయూకే మద్దతు తెలుపుతారు. ప్రస్తుతం ఎస్‌సీఎల్‌యూ వర్కింగ్ కమిటీలో 63 మంది సభ్యులుండగా అందులో 43 మంది జనక్‌ప్రసాద్ యూనియన్‌లో చేరడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. అలాగే ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఒకే యూనియన్ సింగరేణిలో పనిచేయనుండడంతో ఆ పార్టీ శ్రేణులు సైతం సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. 1998లో జరిగిన మొదటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ‘సాజక్’ పేరుతో పోటీచేసి ఆర్జీ-1, 2 డివిజన్లను గెలుచుకుంది. తర్వాత 2007 ఎన్నికల్లో వెంకట్రావుతో కలిసి పనిచేసి గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. అయితే రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను ఓడించడానికి సంజీవరెడ్డి సూచన మేరకు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కలిసి పోటీచేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో గోదావరిఖనిలో జరి గిన ఐఎన్‌టీయూసీ మహాసభల్లో పాల్గొన్న యూనియన్ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి సింగరేణిలో ఐఎన్‌టీయూసీకి అనుబంధంగా ఒకే యూనియన్ ఉంటుందని చెప్పారు. తాజా పరిణామాలు అందుకు అద్దం పడుతుండడంతో యూని యన్ శ్రేణుల్లో చర్చజరుగుతోంది.
మిర్యాల’తో మంతనాలు
టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన మిర్యా ల రాజిరెడ్డిని యూనియన్‌లో స్థానం లేకుండా చేయడం తో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయనను కాంగ్రెస్ అనుబంధ యూనియన్‌లో చేర్చుకునేందుకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎస్‌సీసీడబ్ల్యూ యూ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్, బడికెల రాజలిం గం, గుమ్మడి కుమారస్వామి తదితర నాయకులు మిర్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి సెంటినరీకాలనీలోని నివాసంలో రాజిరెడ్డిని కలిసి యూనియన్‌లోకి రావాలని ఆహ్వానించగా తనకు సమయం కావాలని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని యూని యన్ నుంచి తొలగించడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు సమావేశమై టీబీజీకేఎస్ నాయకత్వంపై ఒత్తిడి తీసురావాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ యూనియన్, టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు వారు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Advertisement
Advertisement