
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య షాక్ తగిలింది. ఒకవైపు ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవ్వగా.. మరోవైపు ఆయన పోటీచేసిన చాముండేశ్వరి నియోజకవర్గంలోనూ పరాభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్దరామయ్య బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రారంభ ట్రెండ్స్‌లో సీఎం సిద్దూ వెనుకబడ్డారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో ఆరంభం నుంచి సిద్దూకు ఎదురుగాలే వీచింది. ఇక్కడ ఆయనపై జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ మొదటిరౌండు నుంచి ఆధిక్యం కనబర్చారు. మొత్తానికి 25,861 ఓట్ల మెజారిటీతో సిద్దరామయ్యపై ఆయన గెలుపొందారు.
అటు బాదామి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్యపై బీజేపీ అభ్యర్థి శ్రీరాములు మొదట ఆధిక్యం కనబచ్చారు. అయితే, లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ.. సిద్దరామయ్య మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఈ నియోజకవర్గంలో శ్రీరాములు, సిద్దరామయ్య మధ్య హోరాహోరి నెలకొంది. బాదామిలో 160 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. సిద్దరామయ్య కొడుకు యతీంద్ర మాత్రం వరుణ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉండి.. విజయం దిశగా సాగుతున్నారు.