![Yeddyurappa Writes To Poll Body on Karnataka Elections - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/22/electionmachine_1.jpg.webp?itok=xQ6u4YZX)
సాక్షి, బెంగళూరు : ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప లేఖ రాశారు. విజయపూర్ జిల్లాలోని ఓ షెడ్డులో పెద్ద ఎత్తున ఓటర్ వెరీఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) యంత్రాలు లభించడంతో ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛాయుత పారదర్శక వాతావరణంలో జరిగాయన్న ఎన్నికల సంఘం వ్యాఖ్యలు ఉత్త డొల్లేనని ఈ ఘటన నిరూపిస్తోంది’ అని యడ్యూరప్ప ఈసీ ప్రధాన అధికారి ఓపీ రావత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, తగినంత సాధారణ మెజారిటీ లేకపోవడంతో ఆయన విశ్వాసపరీక్షకు ముందే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వీవీపీఏటీ యంత్రాలు ఓ షెడ్డులో దొరకడం కలకలం రేపుతోంది. అయితే, వీవీపీఏటీ నిజమైన యంత్రాలు కాదని, ఆ యంత్రాలను తీసుకెళ్లే బాక్సులు మాత్రమే షెడ్డులో దొరికాయని కర్ణాటక ఎన్నికల సంఘం ప్రధానాధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. వీవీపీఏటీ యంత్రాల్లో సిక్స్ డిజిట్ బార్ కోడ్ ఉంటుందని, అందులో ఒక ఇంగ్లిష్ అక్షరం, ఐదు అంకెలు ఉంటాయని, ఇవి ఎక్కడ ఉన్నా కంప్యూటర్‌తో గుర్తించవచ్చునని ఆయన తెలిపారు. షెడ్డులో దొరికిన యంత్రాల్లో సిక్స్ డిజిట్ బార్ కోడ్ లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment