
జెడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమార స్వామి
సాక్షి, మైసూరు: కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వాతావరణం వెడెక్కింది. శాసనసభ ఎన్నికల్లో తాను కింగ్ మేకర్ కాదని, కింగ్‌గానే అవతరిస్తానని.. జేడీఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. మైసూర్‌లోని ఇలవాలలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి శనివారం ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చాముండేశ్వరి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ మూడో స్థానంలో నిలుస్తుందని ఇండియా టుడే చెప్పిన సర్వే తప్పుడమయమన్నారు. ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పడం వృథా ప్రయాసని.. కౌంటింగ్ రోజు వచ్చే ఫలితాలు మరోరకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ వంద స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని, ఇది కన్నడ ప్రజల తీర్పని కుమారస్వామి అన్నారు.
ఇదే విషయాన్ని బాండ్ పేపర్‌పై కూడా రాసిస్తానని మీడియా ముందు కుమార స్వామి సవాల్ విసిరారు. ఇండియా టుడే సర్వే ఎవరు, ఎందుకు చేయించారు అనే విషయం తనకు తెలుసని.. సీఎం సిద్ధరామయ్య సలహాదారుడు దినేష్ అమిన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. సర్వేను ప్రజలు నమ్మొద్దని అన్నారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, మాజీ ప్రధాని దేవెగౌడలను కలిసిన విషయం మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తారని, తెలుగు, కన్నడిగులను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తామని మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment