మతసామరస్యంలో మన రాష్ట్రం ఆదర్శం | KCR Iftar Dinner in Hyderabad | Sakshi
Sakshi News home page

మతసామరస్యంలో మన రాష్ట్రం ఆదర్శం

Published Mon, Jun 3 2019 6:41 AM | Last Updated on Mon, Jun 3 2019 6:41 AM

KCR Iftar Dinner in Hyderabad - Sakshi

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో శ్రీనివాస్‌ గౌడ్, అసదుద్దీన్‌ ఒవైసీ, కె.కేశవరావు, మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ :దేశంలోనే తెలంగాణ ‘గంగా, జమునా తెహజీబ్‌’ ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరాన్ని చూసి మతసామరస్యం గురించి నేర్చుకోవాలని మహాత్మాగాంధీ పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రంజాన్‌ మాస పవిత్ర ఉపవాసాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆదివారం సాయంత్రం ఇక్కడి ఎల్‌బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సీఎం పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని మతాలు, కులాలు సమానమేనని, గత ఐదేళ్ల నుంచి మత సామరస్యం మరింత వెల్లివిరుస్తోందని అన్నారు. అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తూ వారి పండుగలను సైతం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో సైతం గంగా జమునా తెహజీబ్‌ మరింత ఆదర్శంగా కొనసాగే విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని మైనార్టీల పిల్లలకు గురుకుల విద్యాలయాల (టెమ్రీస్‌) ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని, వారు అంతర్జాతీయస్థాయిలో పోటీపడటం సంతోషదాయకమన్నారు. మైనారిటీ గురుకులాలను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ముస్లింలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని, వారి అభ్యున్నతికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విద్యుత్‌ సమస్యను జయించాం...
రాష్ట్రం ఏర్పడే నాటికి 2014లో విద్యుత్‌ కష్టాలు తీవ్రంగా ఉండేవని, ఈ ఐదేళ్లలో విద్యుత్‌ సమస్య లేకుండా విజయం సాధించగలిగామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది ఉండకూడదనేది తమ ఉద్దేశమని, మిషన్‌ భగీరథ పథకం ద్వారా 23 వేల గ్రామాల్లో నల్లా ద్వారా తాగునీరు ఇవ్వబోతున్నామని కేసీఆర్‌ వెల్లడించారు. కేవలం రెండు, మూడు శాతం పనులు మాత్రమే పూర్తి కావల్సి ఉందని అన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని చెప్పారు. 

కాళేశ్వరం ద్వారా సాగునీరు..
జూలైలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్‌ తెలిపారు. రైతు కుటుంబాలన్నీ సుఖశాంతులతో ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు సాగునీటి ప్రాజెక్టు పనులు అంకితభావంతో చేపట్టామని చెప్పారు. ఇఫ్తార్‌ విందులో మంత్రులు మహమూద్‌ అలీ, తల సాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు అసదుద్దీన్‌ ఒవైసీ, బీబీ పాటిల్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ గురుకుల టెన్త్‌టాపర్‌కు, అనీసుల్‌ గుర్భా విద్యార్ధులకు సీఎం బహుమతులు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement