సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అడ్డగోలు అవినీతికి ఆధారాలు చూపుతూ ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
ధర్మవరం: ‘సెంటుకు ఇంత.. ఎకరాకు ఇంత.. అని లెక్కకట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని లెక్కకట్టి మరీ డబ్బులు దండుకుంటున్నారు. నిందలేమో మాపైన వేస్తారా? అసలు రిజిస్ట్రేషన్లు జరిగిన వాటికి డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఎందుకు పెండింగ్‌లో పెట్టారు. ఆ డాక్యుమెంట్లను టీడీపీ నాయకులకు ఇస్తే వారు వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసుకుని ఇస్తున్నారు. అసలు మీరు ఇక్కడెందుకు? రిజిస్ట్రేషన్లు టీడీపీ ఆఫీస్ నుంచే చేయించండి’ అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటామిరెడ్డి ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి తంతు గురించి తెలుసుకున్న ఆయన గురువారం బాధితులతో కలిసి అక్కడికెళ్లి ఆధారాలు చూపుతూ సబ్‌రిజిస్ట్రార్‌ను నిలదీశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు చేయాలి కానీ వాటిని పార్టీ కార్యాలయాలుగా మార్చకూడదని మందలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 200లకు పైగా రిజిస్ట్రేషన్లను పెండింగ్‌లో పెట్టారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి డబ్బులిచ్చి, పర్మిషన్ తెచ్చుకున్న వారికి మాత్రమే డాక్యుమెంట్లు ఇస్తున్నారన్నారు. అలా మామూళ్లు ఇవ్వలేని నిస్సహాయుల పత్రాలను పెండింగ్‌లో పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తంతు నడిపించేందుకు ఏకంగా ఓ వ్యక్తిని కాపలాదారుగా పెట్టారన్నారు. ఇలా రోజువారీ రిజిస్ట్రేషన్లు లెక్కించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఏప్రిల్ నోటీసులకు,ఫిబ్రవరి రిజిస్ట్రేషన్లకు ఏంటి సంబంధం?
ఫిబ్రవరి నెలలో 200 మంది రిజిష్టర్ చేయించుకుంటే ఏప్రిల్ నెలలో మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటీసుల ఆధారంగా వాటిని పెండింగ్‌లో ఉంచారని, దీన్నిబట్టి చూస్తే అవినీతి ఎంత స్థాయిలో జరుగుతోందో ఇట్టే అర్థమవుతుందని కేతిరెడ్డి అన్నారు. పట్టణంలోని చుక్కల భూములను, 08లను టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని విమర్శించారు. వారు ఎప్పుడు చెబితే అప్పుడు ఆ జాబితాలో చుక్కల భూములను చేర్చడం, తొలగించడం పరిపాటిగా మారిందన్నారు. ధర్మవరం తహసీల్దార్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లిస్ట్ పేరుతో ఇటీవల ఓ జాబితానివ్వడం, ఆ తర్వాత మళ్లీ వెంటనే వెనక్కు తీసుకోవడం ఎందుకోసమని ప్రశ్నించారు. అధికారులను అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రజాప్రతినిధి పెద్ద ఎత్తున భూదందా చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. కనీసం చుక్కల భూములు, 08కు సంబంధించిన భూముల విషయంలో నెలకొన్న సందిగ్దతపై ఏనాడైనా స్పందించారా అని ప్రశ్నించారు.
న్యాయం చేసేవరకు పోరాటం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికార పార్టీ నాయకుల దందా, అవినీతిపై చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేసేవరకూ పోరాటం ఉధృతం చేస్తామని కేతిరెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉంచిన 200 మంది రిజిస్ట్రేషన్ పత్రాలను తక్షణం అందించాలని, అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయంలోకి వచ్చి తీసుకువెళ్లిన రవూఫ్ పత్రాలను కూడా సోమవారంలోగా తెప్పించాలని సబ్ రిజిస్ట్రార్‌ను హెచ్చరించారు. చుక్కల భూములు, 08లను ఒక నిర్ధిష్ట విధానంతో గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని, అలా కాకుండా కేవలం అక్రమార్జనే ధ్యేయంగా దొంగ జాబితాలను సృష్టించి డబ్బులు దండుకోవాలని చూస్తే సహించేది లేదని అన్నారు. వారం రోజుల్లోపు బాధితులకు న్యాయం చేయని పక్షంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.
దందాలు మీరు చేస్తూ.. నిందలు మాపైనా?
పట్టణ శివార్లలోని సర్వే నెంబర్ 631లో రవూఫ్ అనే వ్యక్తికి చెందిన 1.50 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసి ఏడాది పూర్తవుతున్నా ఇంతవరకు పత్రాలు ఇవ్వలేదని కేతిరెడ్డి తెలిపారు. రిజిష్టర్ మినిట్స్ బుక్‌లో ఆ పత్రాలను టీడీపీకి చెందిన గోరకాటి రఘునాథ్‌రెడ్డి తీసుకెళ్లినట్లు నమోదు చేసిన విషయాన్ని ఆయన బట్టబయలు చేశారు. ఒకరి భూమికి చెందిన పత్రాలను వేరొకరికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది చట్ట వ్యతిరేకమని, ఫోర్జరీ కిందకు వస్తుందని అన్నారు. సర్వే నెంబర్ 571లో కేవలం 5 ఎకరాలు మాత్రమే 08 కింద ఉంటే 36 ఎకరాల భూమిని రిజిష్టర్ చేయకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న ఇలాంటి అవినీతి, అక్రమాలపై తాము సమగ్ర ఆధారాలతో ఉన్నతాధికారులకు నివేదించామని, దీంతో టీడీపీ నాయకులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేతిరెడ్డి దుయ్యబట్టారు. ‘మేమిచ్చిన జాబితాకు, ప్రస్తుతం నిలిపేసిన రిజిస్టర్లకు సంబంధం ఉందా?’ అని సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామిని ప్రశ్నించారు.
అందుకాయన స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదని విలేకర్ల సమక్షంలో తెలిపారు. కేవలం మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటీసులను ప్రామాణికంగా తీసుకున్నామని, వేరే ఏ ఇతర లేఖలను పరిగణలోకి తీసుకోవడం లేదని సబ్‌రిజిస్టార్ తెలిపారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకుల ఆదాయానికి గండికొట్టామన్న ఉద్దేశంతో వారు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ప్రతిరోజూ ప్రజాప్రతినిధికి డబ్బులు చేరుతున్న విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment