
నామా నాగేశ్వరరావు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎట్టకేలకు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వం ఖరారైంది. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. నామా పేరును గురువారం అధికారికంగా ప్రకటించడంతోపాటు బీఫాం అందజేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రాజకీయ చతురతను ప్రదర్శించి టికెట్ దక్కించుకున్నారు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చివరి నిమిషంలోనైనా టికెట్ లభిస్తుందని ఆయన అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. పది రోజులుగా ఖమ్మం టీఆర్‌ఎస్ ఎంపీ టికెట్ ఎవరు దక్కించుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఎంపీ పొంగులేటికి టికెట్ లభించని పక్షంలో టీఆర్‌ఎస్ ఏ ప్రాతిపదికన ఎవరివైపు మొగ్గు చూపుతుందనే అంశంపై చివరి నిమిషం వరకు స్పష్టత రాని పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పరాజయం పొందడాన్ని పరిగణనలోకి తీసుకుని ఈసారి ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వాన్ని మారుస్తారని కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు(ఆర్టీసీ) పేర్లు అధిష్టానం పరిశీలించినట్లు ప్రచారం జరిగింది.
అయితే నాలుగు రోజులుగా అనూహ్యంగా టీఆర్‌ఎస్ రాజకీయ తెరపైకి నామా నాగేశ్వరరావు ప్రత్యక్షం కావడం.. ఆయన సీఎంను కలిసి పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో నామాకు లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉందని ప్రచారమైంది. దీనికి అనుగుణంగా నామా మంగళవారం టీడీపీకి, పదవులకు రాజీనామా చేయడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైందనే ప్రచారం ఊపందుకుంది. అధికారికంగా గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన నామా.. కొద్దిగంటల్లోనే పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కావడం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నామా పేరును అధికారికంగా ప్రకటించడానికి కొద్దిసేపటికి ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి.. నామా అభ్యర్థిత్వం ఖరారైనట్లు సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2004లో టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నామా ఆ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయారు. ఇప్పటికి మూడుసార్లు లోక్‌సభకు, ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసిన నామా నాలుగోసారి ఖమ్మం ఎంపీగా పోటీ చేయనున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు పోటీ చేసిన నేతగా ఆయన గుర్తింపు పొందారు.
సన్నిహితులతో సంప్రదింపులు
నామాకు టికెట్ ఖరారు కావడంతో ఎన్నికల్లో తన గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ నేతలు, సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ రాకపోవడంపై పార్టీలోని ఆయన అనుచరులు, అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పొంగులేటిపై ఆయన అభిమానులు, అనుచరుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారేది లేదని, టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతాననే సంకేతాలను పొంగులేటి ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఆ పార్టీలో సుదీర్ఘకాలంగా రాజకీయ మిత్రులు, రాజకీయ ప్రత్యర్థులు సైతం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఖమ్మం ఎంపీ అభ్యర్థి గెలుపును టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందుకోసం అధినాయకత్వం ఎటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుంది? అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఎటువంటి విధానాన్ని అవలంబిస్తుందనే అంశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను, టీఆర్‌ఎస్ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి పార్టీలో కొనసాగుతున్న ఉద్యమకారులను సమన్వయం చేసుకుని తన విజయానికి తోడ్పడేలా కృషి చేయాల్సిన బాధ్యత పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుపై పడింది.
దీంతో ఆయన ఇప్పటికే తన విజయానికి సహకరించాలని, పార్టీ అభివృద్ధి కోసం, కేసీఆర్ లక్ష్య సాధన కోసం ఏకతాటిపై నిలవాల్సిన అవసరంపై ఆయన వారిని వ్యక్తిగతంగా కలిసి సహకారం కోరినట్లు తెలుస్తోంది. నామా అభ్యర్థిత్వంపై టీఆర్‌ఎస్‌లోని పలువురు నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ పార్టీ అధినేత సూచన మేరకు పనిచేయక తప్పదనే భావన వ్యక్తమవుతోంది. పార్టీ అభ్యర్థిగా నామా ఈనెల 22న ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసి.. 25న అధికారికంగా మరోసారి నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామా 22న ఖమ్మం చేరుకోలేకపోతే ఆయన తరఫున పార్టీ వర్గాలు నామినేషన్ వేసే అవకాశం ఉంది.
జిల్లాలోని టీఆర్‌ఎస్ నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి అభ్యర్థి విజయానికి కృషి చేసేలా సమన్వయపరిచే బాధ్యతను పార్టీ అధినేత కేసీఆర్.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై పెట్టినట్లు సమాచారం. నామా టీఆర్‌ఎస్‌లో చేరిక కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నామాతోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, మహిళా ఆర్థిక సంస్థ మాజీ చైర్మన్ మద్దినేని బేబి స్వర్ణకుమారి, మాధవరావు, ఇతర జిల్లాలకు చెందిన నేతలున్నారు.
నామా బయోడేటా
పేరు : నామా నాగేశ్వరరావు
తల్లిదండ్రులు : వరలక్ష్మి–ముత్తయ్య
పుట్టిన తేదీ : 15–3–1958
పుట్టిన స్థలం : కొక్కిరేణి గ్రామం, తిరుమలాయపాలెం మండలం
భార్య : చిన్నమ్మ
సంతానం : ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
విద్యార్హతలు : ఇంటర్మీడియట్
వృత్తి : పారిశ్రామికవేత్త
రాజకీయ రంగప్రవేశం : 2004లో టీడీపీలో చేరారు. ఆ సంవత్సరంలోనే ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2014లో టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. టీడీపీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసిన నామా గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment