
శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కోదండరాం, దిలీప్‌కుమార్ తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాకూటమి పొత్తుల అం శాన్ని త్వరగా తేల్చాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కోరారు. అప్పుడే తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు ప్రజాకూటమి ప్రత్యామ్నాయ శక్తిగా కనబడుతుందని వివరించారు. శుక్రవారం ఢిల్లీలో రాహుల్ కార్యాలయ కార్యదర్శి కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ ఆధ్వర్యంలో కోదండరాం, టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ తదితరులు రాహుల్‌గాంధీని ఆయన నివాసంలో కలిశారు.
సుమారు 40 నిమిషాలు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా కూటమి ఏర్పాట్లపైనే చర్చ జరిగిందని, సీట్ల పంపకాలపై చర్చించలేదని సమావేశం అనంతరం కోదండరాం తెలిపారు. ‘రాజకీయాల ద్వారా అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అందుకు కలసి వచ్చేవారితో పనిచేస్తామని రాహుల్ చెప్పారు. అదే ప్రాతిపదికన కలలు కన్న తెలంగాణ నిర్మాణం కోసం కలసి పనిచేసేందుకు టీజేఎస్ సిద్ధంగా ఉందని చెప్పాం. తెలంగాణలో నిరంకుశ పాలన అంతానికి కూటమి ఏర్పాటు సాధ్యపడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే కూటమి ఏర్పాట్లను త్వరగా తేల్చాలని కోరాం. దీనికి రాహుల్ కూడా సమ్మతించారు’అని కోదండరాం అన్నారు.
కూటమి ప్రక్రియ నడవట్లేదు..
‘ప్రస్తుతానికి ప్రజాకూటమి ఏర్పాట్ల ప్రక్రియ నడవట్లేదు. భాగస్వామ్య పక్షాల సీట్ల పంపకాలపై చర్చ జరగట్లేదు. కాలయాపన చేయడం ద్వారా ఎవరికీ ఉపయోగం ఉండదు. మేం బలంగా ఉన్న స్థానాలనే ఆశిస్తున్నాం. 15 సీట్లు అడుగుతున్నాం. వాటిని సాధించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే తర్వాతేంటన్నది అప్రస్తుతం. ఇది కూటమి నిర్మాణానికి సంబంధించిన విషయం. కూటమి అన్నది ఆధికారం కోసమే ఏర్పడితే నిష్ప్రయోజనం’అని కోదండరాం పేర్కొన్నారు.
కాంగ్రెస్ నిర్ణయంపై మాట్లాడను..
కాంగ్రెస్ 95 స్థానాల్లో, టీడీపీ 14 స్థానాల్లో పోటీకి నిర్ణయం జరిగిందని కుంతియా, ఉత్తమ్ స్పష్టం చేయడంపై కోదండరాంను మీడియా ప్రశ్నించగా.. ఆ ప్రకటన నేను చూడలేదని, దానిపై మాట్లాడనంటూ బదులిచ్చారు. ప్రజలు ఆశగా చూస్తున్న ప్రజాకూటమిని ఇంతదూరం తీసుకొచ్చాం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది అప్రస్తుతమని ర్కొన్నారు. పొత్తులపై తేలాక ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
టీడీపీతో ఘర్షణలు మర్చిపోలేదు..
‘తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీతో సైద్ధాంతికంగా పడ్డ గొడవలు మర్చిపోలేదు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి కార్యాచరణ ప్రాతిపదికనే కలవగలుగుతున్నాం’ కోదండరాం పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమాన్ని భుజాలపై మోసిన వ్యక్తి కోదండరాం. అమరుల త్యాగాలను అవమానపరిచేలా కేసీఆర్ పాలన సాగించారు. దీనికి వ్యతిరేకంగా పోరాడటంలో కలసి పనిచేసేందుకే రాహుల్‌ను కోదండరాం కలిశారు’ అని మధుయాష్కీగౌడ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment