‘ఏంది రెడ్డీ ఇట్ల సేత్తివి. మీ కుటుంబాన్ని నమ్ముకుని తెలుగుదేశం నాయకుల అరాచకాలపై కొట్లాడి మా కుటుంబాలు కూడా ఆగమాయనే. జైలుకు కూడా పోయొస్తిమే. అధికారం ఉన్నా,లేకపోయినా మీ వెంటే ఉంటిమే. చివరాఖరుకు నీవు కూడా ఇట్ల చేస్తే ఎట్ల రెడ్డీ?’– ఇదీ ఇప్పుడు కోట్ల అనుచరుల నుంచి వ్యక్తమవుతున్న ఆవేదన. ‘ఇట్లనే కాంగ్రెస్‌లో ఉన్నా నీ వెంటే ఉంటుంటిమి. కుటుంబాలను ఆగమాగం చేసిన టీడీపీతో కలిస్తే మీతో మేమురాలేమ’ని తెగేసి చెబుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో చేరితే మీ దారి మీదే.. మా దారి మాదేనని స్పష్టం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం విజయవాడలో సమావేశమయ్యారు. అమావాస్య వెళ్లిన తర్వాత అంటే ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల నిర్ణయంపై అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. మరోవైపు కోట్ల రాకను టీడీపీలోని కేఈ వర్గం బలంగా వ్యతిరేకిస్తోంది.
నాతో వచ్చేదెవరు?
వాస్తవానికి ఇప్పటికే కోడుమూరు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి వెంట వైఎస్సార్‌సీపీలో చేరేందుకు అనేక మంది సిద్ధమయ్యారు. మరికొందరు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తుది నిర్ణయం కోసం ఎదురుచూశారు. తీరా ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమైపోవడంతో తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. ఆయన అనుచరుల్లో అత్యధిక భాగం వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే కొద్ది మంది ఏకంగా రాజకీయాలకు దూరమయ్యేందుకు నిర్ణయించుకున్నారు. పుట్టినప్పటి నుంచి టీడీపీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి, కుటుంబాలను సైతం కోల్పోయి, జైలు జీవితం గడిపిన తాము ఇప్పుడు ఆ పార్టీలో ఎలా చేరుతామని నేరుగా కోట్లను ప్రశ్నిస్తున్నారు.
రాజకీయాలకైనా దూరంగా ఉంటాం తప్ప.. టీడీపీతో కలిసి నడిచే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆచితూచి స్పందించారు. కోట్ల చేరికపై తనకు సమాచారం లేదని పత్రికా ప్రకటన ఇవ్వడమే కాకుండా ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించారు. అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. డిప్యూటీ సీఎంకే సమాచారం లేకుండా చేరికలు జరగడంపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచీ వైరి వర్గంగా ఉన్న తాము ఆయన ఎంపీగా పోటీ చేసినా సహకరించే పరిస్థితి ఉండదని అంటున్నారు. మొదటి నుంచి బుట్టా రేణుకతో వైరం ఉన్న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రం కోట్ల రాకను స్వాగతించారు. మరోవైపు ఎస్వీ ప్రకటనపైనా కేఈ వర్గం మండిపడుతోంది. మొన్నటివరకు తమ సహకారం తీసుకుని ఇప్పుడు ప్లేటు ఫిరాయించి కోట్ల పంచన చేరుతున్నారని వారు విమర్శిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ముఖ్యమంత్రితో కోట్ల కుటుంబం కలవడం జిల్లా అధికార పార్టీలో అలజడి రేపిందనే చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment